23 June, 2026 | 6:59 AM

కోలుకున్న రూపాయి

13-06-2024 04:29 AM

11 పైసలు పెరిగిన కరెన్సీ

ముంబై, జూన్ 12: దేశీయ స్టాక్ మార్కెట్ జోరందుకుని, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్ఠానికి చేరడంతో రూపాయి రికార్డు కనిష్ఠస్థాయి నుంచి స్వల్పంగా కోలుకున్నది. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపు 83.59తో పోలిస్తే 11 పైసలు కోలుకున్నది. తొలుత 83.56 స్థాయి వద్ద ప్రారంభమైన రూపాయి 83.58 కనిష్ఠానికి తగ్గిన తర్వాత వేగంగా కోలుకుని 83.48 స్థాయి వద్ద ముగిసింది. అటు యూఎస్, ఇటు భారత్‌లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందన్న వార్తలతో రూపాయి రికవరీ అయ్యిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. పాజిటివ్ స్టాక్ మార్కెట్ కారణంగా రూపాయి పెరిగిందని, అయితే యూఎస్ డాలర్ పటిష్ఠత, క్రూడ్ ధరల పెరుగుదల ఫలితంగా కరెన్సీ భారీ లాభాలకు అడ్డుకట్ట పడిందని బీఎన్‌పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. డాలర్ల డిమాండ్‌తో పోలిస్తే సరఫరా తక్కువగా ఉన్నందున, రానున్న రోజల్లో రూపాయి క్రమేపీ బలహీనపడుతుందని కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ అంచనా వేశారు.