- నూతన గరిష్ఠస్థాయికి స్టాక్ సూచీలు
- తిరిగి 80,000 శిఖరంపై సెన్సెక్స్ పాగా
- 24,400 దాటిన నిఫ్టీ
ముంబై, జూలై 9: ఒక రోజు విరామానంతరం మంగళవారం తిరిగి బుల్స్ కదం తొక్కారు. ఆటోమొబైల్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో భారీ కొనుగోళ్లు జరపడంతో ప్రధాన స్టాక్ సూచీలు రెండూ నూతన గరిష్ఠస్థాయి వద్ద ముగిసాయి. మళ్లీ 80,000 పాయింట్ల స్థాయిని అవలీలగా అధిగమించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 407 పాయింట్లు పెరిగి 83,397 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 391 పాయింట్ల లాభంతో 80,352 పాయింట్ల కొత్త రికార్డుస్థాయి వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 123 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపి 24,443 పాయింట్ల వద్ద నూతన రికార్డును నెలకొల్పింది.
చివరకు 112 పాయింట్ల లాభంతో 24,433 పాయింట్ల కొత్త గరిష్ఠస్థాయి వద్ద ముగిసింది. దేశీయ, అంతర్జాతీయ అంశాలు మార్కెట్ మూమెంటంకు దోహదపడ్డాయని, రుతుపవనాల ప్రగతితో ప్రస్తుతం వినిమయ రంగాలైన ఆటో, ఎఫ్‌ఎంసీజీలు ర్యాలీకి నేతృత్వం వహించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చిందని చెప్పారు.
రూ.450 లక్షల కోట్లను మించిన మార్కెట్ విలువ
తాజా ర్యాలీతో భారత స్టాక్ మార్కె ట్ విలువ రూ.450 లక్షల కోట్ల మార్క్ ను దాటి కొత్త రికార్డు సృష్టించింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,51,27,853 కోట్ల కు చేరింది. మంగళవారం ఇన్వెస్టర్ల సంప ద రూ.1,56 లక్షల కోట్ల మేర పెరిగింది. కొద్ది రోజులుగా ఇండెక్స్ హెవీవెయిట్స్‌లో కొనుగోళ్లు జరుగుతున్నాయి.
మారుతి జోరు
సెన్సెక్స్ బాస్కెట్‌లో అత్యధికంగా మారుతి సుజుకి షేరు 6 శాతాన్ని మించి పెరిగింది. హైబ్రీడ్ కార్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించిందన్న వార్త మారుతి ర్యాలీకి పురికొల్పింది. మారుతి కార్లకు ఉత్తరప్రదేశ్ పెద్ద మార్కెట్ కాగా, ఆ కంపెనీ విక్రయించే గ్రాండ్ వితారా, మరో మోడల్‌కు భారీగా రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గడంతో వాటి అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాలతో ఈ షేర్లలో కొనుగోళ్లు జరిగినట్టు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, సన్‌ఫార్మా, ఐటీసీ, నెస్లే, టాటా మోటార్స్ 1 శాతం మధ్య పెరిగాయి.
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు క్షీణించాయి. వివిధ రంగాల సూచీల్లో జోరుగా అత్యధికంగా ఆటోమొబైల్ ఇండెక్స్ 2.17 శాతం పెరిగింది. కన్జూమర్ డ్యూరబుల్స్ సూచి 2,01 శాతం, రియల్టీ 1.23 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 1.21 శాతం, యుటిలిటీస్ సూచి 0.76 శాతం చొప్పున పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, టెలికమ్యూనికేషన్స్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీస్ ఇండెక్స్‌లు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం లాభపడింది. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,010 షేర్లు లాభాలతో ముగియగా, 1,924 షేర్లు క్షీణించాయి.