18-09-2025 01:16:39 AM
ఏడీఈ అంబేద్కర్ బినామీ..
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ బినామీల ఇండ్లల్లో రెండు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి. కాగా అంబేద్కర్ బినామీ, చేవెళ్ల ఏడీ రాజేశ్ ఇంట్లోని బాత్రూం లో బుధవారం ఏసీబీ అధికారులకు రూ.20 లక్షల నోట్ల కట్టలు లభించాయి. బాత్రూంలో దాచి ఉంచిన నగదు కట్టలను చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు.
నగదును స్వాధీనం చేసుకున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అంబేద్కర్‌కు సంబంధించిన మరికొం దరు బినామీల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయని, ఈ దర్యాప్తులో మరిన్ని అక్రమాస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అంబేద్కర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బుధవారం న్యాయమూర్తి ఎదుట అతన్ని హాజరుపరచగా, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించడంతో నిందితుడిని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఖరీదైన ఫ్లాట్లు, విలాసవంతమైన కార్లు
విద్యుత్ శాఖలో తన అధికారిక హోదాను అడ్డుపెట్టుకొని, అడ్డగోలుగా సంపాదించారన్న విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు ఏడీఈ అంబేద్కర్‌పై కేసు నమోదు చేశారు. మంగళవారం ఏకకాలంలో ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించి, అక్రమాస్తుల చిట్టాను చూసి నివ్వెరపోయారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు, అక్రమ లావాదేవీల పూర్తి వివరాలు రాబట్టేందుకు అంబేద్కర్‌ను కస్టడీకి కోరుతూ ఏసీబీ త్వరలో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.