రికార్డు సృష్టించిన బుర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి
బూర్గంపాడు,ఏప్రిల్ 28(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో బుర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి మరో ముందడుగు వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గత ఒక సంవత్సరం కాలంలో వంద కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్రచికిత్సలు నిర్వహించి రికార్డు సృష్టించారు.నాడు ప్రతి చిన్న ఆరోగ్య సమస్య కి భద్రాచలం ఆసుపత్రికి వెళ్ళే స్థాయి నుండి అతి తక్కువ సమయంలోనే రికార్డ్ స్థాయిలో శస్త్రచికిత్స లు చేసే స్థాయికి బుర్గంపాడు ఆసుపత్రి చేరుకుంది.
గత 14-15 సంవత్సరాలుగా ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో ఈ ఆసుపత్రి ప్రాథమిక వైద్య సేవలకే పరిమితమైంది. అంతేకాక పాత ఆసుపత్రి భవనం కారణంగా సేవలు మరింత పరిమితమయ్యాయి. అనంతరం అప్పటి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ నిధులు మంజూరు చేయడంతో పాత ఆపరేషన్ థియేటర్‌ను పునరుద్ధరించి, అవసరమైన పరికరాలు, శస్త్రచికిత్స సామగ్రిని సమకూర్చి తిరిగి ప్రారంభించారు. నియోజకవర్గ సమీక్షలో స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు డిసిహెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు ప్రత్యేక చొరవతో స్పెషాలిటీ సేవల భాగంగా గైనకాలజిస్ట్‌ను నియమించారు.
ఆపరేషన్ థియేటర్ ప్రారంభమైన తర్వాత ఏడాది వ్యవధిలోనే వంద ట్యూబెక్టమీ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడం బుర్గంపాడు వంటి చిన్న ఆసుపత్రికి విశేషమని చెప్పవచ్చు. పది కిలోమీటర్ల దూరంలో 200 పడకల భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఉన్నప్పటికీ, 30 పడకల బుర్గంపాడు ఆసుపత్రి సిబ్బంది తమ సేవలతో రోగుల విశ్వాసాన్ని సంపాదించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, శిశు వైద్య నిపుణులు డాక్టర్ ముక్కంటేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఈ సేవలు ప్రారంభమై, అనంతరం గైనకాలజిస్ట్ డా. అనూష లక్ష్మి ఆధ్వర్యంలో మరింత విస్తరించాయి.కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటు సిజేరియన్ ఆపరేషన్లు, నార్మల్ డెలివరీలు, గర్భిణీ స్త్రీలకు అవసరమైన రక్తహీనత నివారణ సేవలు సహా పలు ప్రసూతి సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త ఆసుపత్రి భవనం మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుండగా, స్కానింగ్ సేవలను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు డిసీహెచ్ ఎస్ జి. రవి బాబు తెలిపారు.ఆపరేషన్ థియేటర్ ఇన్‌చార్జ్ నర్సింగ్ అధికారి ఎం. పద్మ, జ్యోతి, కరుణ శ్రీ, అనురాధ, రాజకుమారి, అనూష, నీలమ్మ, కవిత తదితరులు రోగులకు 24 గంటలపాటు సేవలు అందిస్తూ విశ్వాసాన్ని పెంపొందించారు. ప్రజల్లో నమ్మకం పెరగడంతో ఆసుపత్రికి రోగుల రద్దీ గణనీయంగా పెరిగింది.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డి సి హెచ్ ఎస్ డా. రవి బాబు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరావు, డాక్టర్ అనూష లక్ష్మి, ఇతర సిబ్బంది కృషిని అభినందించారు.






