కిశోర బాలికలు ఆరోగ్యం, భద్రతపై అప్రమత్తంగా ఉండాలి
చిట్యాల,(విజయక్రాంతి): కిశోర బాలికలు తమ ఆరోగ్యం, విద్య మరియు వ్యక్తిగత భద్రత పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఐ.సి.డి.ఎస్. ఏ.సి.డి.పి.ఓ. వెంకటమ్మ పేర్కొన్నారు. మంగళవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో కిశోర బాలికల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్నేహ అవగాహన సదస్సు’కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని 14 నుండి 18 ఏళ్ల లోపు బాలికలు, వారి తల్లులతో ముఖాముఖి మాట్లాడారు.
ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ల వాడకం వల్ల ఎదురవుతున్న ముప్పులను వివరించిన ఏ.సి.డి.పి.ఓ. బాలికలు తమ భద్రతపై రాజీ పడకూడదని సూచించారు. అంతేకాకుండా పిల్లలు తమ మనసులోని ఏ విషయాన్నైనా భయం లేకుండా పంచుకునేలా తల్లిదండ్రులు వారితో స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలని, పిల్లలకు అవసరమైన స్వేచ్ఛను ఇస్తూనే వారిని కనిపెట్టుకుని ఉండాలని కోరారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని, అంతవరకు వారికి ఉన్నత చదువులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ , కిశోర బాలికలు, వారి తల్లిదండ్రులు, ఆశా కార్యకర్తలు, వి.బి.కె.లు, సంఘ బంధం అధ్యక్షురాలు మరియు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.






