16-05-2025 12:10:42 AM
రాజేంద్రనగర్, మే 15: అమాయకులను బురిడీ కొట్టించి నకిలీ పాస్పోర్టులు, వీసాలతో విదేశాలకు పంపుతున్న ముఠాను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్ పోలీసులు అరెస్టు చే సి రిమాండ్ కు తరలించారు. కేసు వివరాలను బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఏసీపీ శ్రీ కాంత్ గౌడ్ మీడియాకు వెల్లడించారు.
నకిలీ పాస్పోర్టు లు, వీసాలతో 8 మంది వ్యక్తులను శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఎయిర్పోర్ట్ పోలీసులు, ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి ముఠాలోని ఇద్దరు వ్యక్తులను అరె స్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ చిలుకూరి, బాలరాజు, అన్నమయ్య జిల్లాకు చెందిన సుంకర శివకుమార్, కడప జిల్లాకు చెందిన గోపాల్, హైదరాబాద్ నివాసి అంజి కలిసి ఓ ముఠాగా ఏర్పడి అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని నమ్మబలికి నకిలీ వీసాలు తయారు చేసి వారి నుంచి లక్షల్లో వసూలు చేసి విదేశాలకు పంపుతుంటారు.
బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి 8 మందిని మస్కట్ పంపిస్తుండగా దాడులు చేశా రు. నకిలీ వీసాల ముఠాలోని ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి బాలరాజు, అన్నమయ్య జిల్లాకు చెందిన సుంకర శివకుమార్ ను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు సత్యనారాయణ, అంజి, గోపాల్ పరారీలో ఉన్నట్లు ఏసిపి వెల్లడించారు.
ఈ ముఠా నుంచి 14 నకిలీ పాస్పోర్టులు, 14 వీసాలు, 7 సెల్ ఫోన్లు, 16 విమాన టికెట్లు, రెండు స్టాంపులు, ఓ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. మిగతా ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔట్ పోస్టు సీఐ బాలరాజు, ఎస్‌ఐ సిద్దేశ్వర, ఎస్‌ఐ, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.