26 July, 2026 | 9:10 PM

లోయలో పడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం

30-05-2024 04:04 PM

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో గురువారం విషాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన బస్సు లోయలోపడి పదిహేను మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ నుంచి శివ్ ఖోరీకి యాత్రికులతో వెళ్తున్న బస్సు అఖ్నూర్- భంబ్లా మధ్య చౌకీ చౌరా వద్ద చుంగి మార్హ్ ప్రాంతం 150 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిందని అధికారులు తెలిపారు.

ప్రమాద సమయంలో అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న తక్షణమే సంఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని అధికారి తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు.