23 April, 2026 | 2:19 AM

మేడ్చల్ డిపోకే పరిమితమైన బస్సులు

23-04-2026 12:56 AM

128 బస్సులకు విశ్రాంతి 

మేడ్చల్ బస్ డిపోకు ఒక రోజు రూ. 22 లక్షల నష్టం 

సమ్మెలోకి 650 మంది ఆర్టీసీ కార్మికులు

మేడ్చల్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగడంతో మేడ్చల్ బస్ డిపోలో బస్సులు డిపో కే పరిమితమయ్యాయి. దాదాపు 128 బస్సులు డిపో కే పరిమితం అయ్యాయి.  650 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ లో బస్సుల కోసం పడి కాపులు కాస్తున్నారు.

మంగళవారం అర్ధరాత్రి వరకు ఆర్టీసీ అధికారులకు కార్మికుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుంది అంటూ మేడ్చల్ ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, రెండు 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్ తో అమలు చేయాలని, 2025 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు 400 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్ లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఆర్టీసీ ఉద్యోగులపై పని భాగాలు తగ్గించాలని, మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. బస్సులన్నీ డిపోకే పరిమితం కావడంతో మేడ్చల్ డిపో ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులు నిలిచిపోవడం వల్ల డిపోకు రోజుకు రూ. 22 లక్షల నష్టం వస్తుంది.