అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం..
తడిచిన మిర్చి, వరి, నష్టపోయిన రైతాంగం
మంగపేట, ఏప్రిల్ 22 ( విజయక్రాంతి ) : ములుగు జిల్లా మంగపేట, ఏటూరునాగారం మండలాలలోని పలు గ్రామాలలో బుధవారం సాయంత్రం అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. అకాల వర్షం కురవడంతో మిర్చి, వరి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు గ్రామాలలో ఈదురు గాలులతో అకాల వర్షాలు పడడంతో అనేక ఎకరాలలో పలువురు రైతులకు చెందిన వరి పంట నేలవాలింది.
మంగపేట, ఏటూరునాగారం మండలాలలోని పలు గ్రామాలలో అకాల వర్షం పడడంతో ఆరుగాలం కష్టించిన పంట వర్షానికి తడవకుండా ఉండడం కోసం కళ్లాలలో కోసి ఆరబెట్టిన మిర్చి, వడ్లు తడవకుండా రైతులు టార్పాలిన్లు కప్పారు. అయినా కొన్ని చోట్ల వడ్లు, మిర్చి తడిచింది. అకాల వర్షంవలన రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది.అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.






