పేదల ఖాతాలతో దందా
- డబ్బు ఆశ చూపి అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాల సేకరణ
- రెండు నెలల్లో రూ.175 కోట్ల లావాదేవీల గుర్తింపు
- ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి) : అమాయకపు ప్రజలకు డబ్బు ఆశ చూపి వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించి, సైబర్ నేరగాళ్లకు వాటిని అందజేస్తున్న ఇద్దరు హైదరాబాదీలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 600 సైబర్ నేరాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేవలం మార్చి, ఏప్రిల్ రెండు నెలల్లో 6 బ్యాంకు ఖాతాల ద్వారా నిందితులు రూ. 175 కోట్ల లావాదేవీలకు పాల్పడినట్లు టీజీసీఎస్‌బీ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) అధికారులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. సైబర్ క్రైమ్ నేరాలను నమోదు చేసే ఎన్‌సీఆర్‌పీ(నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్)లో నమోదు అయిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్‌సీఆర్‌పీ అధికారులు విచారణ చేపట్టగా, హైదరాబాద్‌లోని శంషీర్‌గంజ్ ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ క్రైమ్ లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీనిపై దృష్టి సారించిన టీజీసీ ఎస్‌బీ సిబ్బంది బ్యాంకు అధికారులను సంప్రదించి వివరాలు సేకరించి సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ బ్యాంకు ఖాతాలకు నగదు జమ అయినట్లు, ఆ నగదును క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్‌కి తరలించినట్లుగా అధికారులు గుర్తించారు.
దుబాయ్ కేంద్రంగా సైబర్ క్రైమ్..
ఈ ముఠా ప్రధాన నిందితుడు దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నేరాలకు సహకరించేందుకు సహచరులను నియమించుకొని వారికి కమిషన్ రూపంలో కొద్ది మొత్తంలో డబ్బు ముట్టజెప్పి వారి ద్వారా పేద, అమాయకపు ప్రజలతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, హవాలా కార్యకలాపాలకు వాటిని ఉపయోగించుకుంటున్నట్లు తేల్చారు. బ్యాంకు ఖాతాలు తెరవడంలో అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేయడంలో షోయబ్ కీలక పాత్ర పోషించడని అధికారులు చెప్పారు. బ్యాంకు ఖాతాలు తెరిపించి, చెక్కులపై సంతకాలు చేయించుకుని అమాయకులకు డబ్బులు ఇచ్చేస్తారు.
సైబర్ నేరాలకు ఆ ఖాతాలను ఉపయోగించి అందులో డబ్బు జమ అయిన తర్వాత ఆ డబ్బును విత్‌డ్రా చేసి క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్ పంపిస్తారు. ఈ క్రమంలో నిందితులుగా ఉన్న మసాబ్ ట్యాంక్ విజయనగర్ కాలనీకి చెందిన మహమ్మద్ షోయబ్ తఖీర్(34), మోఘల్‌పురాకు చెందిన మహ్మద్ బిన్ అహ్మద్ బవాజీర్(49)లను టీజీసీఎస్‌బీ అధికారులు శనివారం అరెస్ట్ చేసి, నిందితులపై పలు ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు.
బ్యాంకు ఖాతాలపై జాగ్రత్త : టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్
డబ్బుకు ఆశపడి, ఇతరులు చెప్పారని బ్యాంకు ఖాతాలు తెరవవద్దని, అనుమానస్పద లావాదేవీలలో పాల్గొనవద్దని ప్రజలకు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ఇప్పటికే మ్యూల్ ఖాతాలను తెరచి ఉంటే, దానిని 1930 నంబరులో, వెబ్‌సైట్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో అద్భుత ప్రతిభ కనబర్చిన టీజీసీఎస్‌బీ అధికారులు ఎస్పీ దేవేందర్ సింగ్, డీఎస్పీలు హరికృష్ణ, కె.వి.ఎమ్ ప్రసాద్, ఇన్‌స్పెక్టర్లు డి.శ్రీను, మహేందర్‌లను అధికారులు అభినందించారు.






