రిజిస్ట్రేషన్ ఆఫీసులు రెండేళ్లలో రెడీ
- ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి
- అద్దెలు, ఛార్జీలకు త్వరలోనే నిధులిస్తా..
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయ క్రాంతి): రెండేళ్లలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తాయని రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్య రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యో గులందరూ నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలని కోరారు. రిజిస్ట్రే షన్ల కోసం వచ్చే ప్రజల నుంచి ఎలాం టి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందించాలని సూచించారు. ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడు తూ.. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన నిధులను త్వరలో క్లియర్ చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చా రు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ శాఖ ల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసులను రాష్ట్రంలో నూ పాటించేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజ లకు పారదర్శకంగా సేవలను అందించేందుకు కొత్త టెక్నాలజీని అవలంబించాల్సిన అవసరాన్ని వివరించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి శాఖ పరమైన పనితీరు గురించి మంత్రికి వివరించారు. 2014లో రూ.2,746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది రూ.14,588 కోట్లకు చేరిందని తెలిపారు.
మంత్రి పొంగులేటి మార్గదర్శకత్వంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీలు సజావుగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వార్షిక నివేదికను కూడా మంత్రి విడుదల చేశారు. రెవెన్యూ సమీకరణ, శాఖ పనితీరు, శాఖకు సొంత భవనాలు, డిపార్ట్‌మెంట్ బడ్జెట్ ఆవశ్యకత మొదలైన వాటిపై సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలను తెలిపారు.






