పదోన్నతులపై క్యాలెండర్
- రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తాం
- దేశానికే రోల్ మాడల్‌గా కొత్త ఆర్‌వోఆర్ యాక్టు
- నూతన చట్టంతో అన్నదాతలకు భరోసా
- అన్నివర్గాలతో చర్చించాకే రెవెన్యూ చట్టం
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- నూతన చట్టం ముసాయిదాపై ట్రెసా చర్చాగోష్టి
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 19 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన ఆర్‌ఓర్ యాక్టు 2024 దేశానికే రోల్ మాడల్‌గా నిలుస్తుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం తీసుకురాబోతున్న నూతన రెవెన్యూ చట్టం రాష్ట్రంలోని రైతులకు భరోసానిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖను బలోపేతం చేయడంతోపాటు రెవెన్యూ ఉద్యోగుల పదోన్న తులకు సంబంధించిన క్యాలెండర్‌ను ప్రకటిస్తామని తెలిపారు. సోమవారం నూతన రెవెన్యూ చట్టంపై ఓ హోటల్‌లో ట్రెసా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్) ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చాగోష్టిలో పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టంతోపాటు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ధరణికి త్వరలోనే చరమగీతం పాడుతామని పునరుద్ఘాటించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఓ పెద్దమనిషి, ఒక ఉన్నతాధికారి కలిసి కుట్రపూరితంగా రాత్రికి రాత్రి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు త్వరలోనే తీర్చతామని స్పష్టంచేశారు. రైతుల భూమికి సంబంధించిన చిక్కులను శాశ్వతంగా దూరం చేయాలనే లక్ష్యంతో నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతు సుభిక్షంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమ ని వెల్లడించారు.
ప్రభుత్వాలు చట్టాలు సరిగ్గా చేయకపోతే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం అమలు చేసిన ఆర్‌వోఆర్ చట్టం ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. ఆలస్యమైనా సరే రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటిని పరిష్కరించడంతోపాటు భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఏ చిన్న లొసుగులకు అవకాశం లేకుండా నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.
ఈ క్రమంలోనే సామాన్య ప్రజల నుంచి రైతులు, మేధావుల అభిప్రాయాలను తీసుకోవాలనే లక్ష్యంతోనే ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో పెట్టామని పేర్కొన్నారు. అలాగే ఈ చట్టంలో చేర్చాల్సిన, తొలగించాల్సిన అంశాలపై మున్ముందు అనేక చర్చాగోష్టిలను నిర్వహిస్తామని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించారు.
హామీ మేరకు ధరణి రద్దు పక్కా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ధరణిని రద్దు చేస్తామని పొంగులేటి స్పష్టంచేశారు. ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని దుర్విని యోగం చేయకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాల్లో అన్నీ వర్గాల ఆలోచనలను, అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోకపోతే ఎలాంటి సంస్కరణ అయినా శూన్యగతికే చేరుకుంటుందనడానికి ధరణి పోర్టలే నిలువెత్తు నిదర్శనమని చెప్పారు.
ఇది ఫార్మర్స్ ఫ్రెండ్లీ చట్టం
నూతన రెవెన్యూ చట్టం ఫార్మర్స్ ఫ్రెండ్లీ చట్టమని ప్రముఖ భూచట్టాల నిపుణులు, నూతన రెవెన్యూ చట్టం. ముసాయిదా రూపకర్త భూమి సునీల్‌కుమార్ అన్నారు. త్వరలోనే ఈ చట్టానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను కూడా రూపొందిస్తామని చెప్పారు. అనంతరం రెవెన్యూ అధికారులు లేవనెత్తిన పలు అనుమానాలను నివృత్తి చేశారు. నూతన రెవెన్యూ చట్టంలో పొందుపర్చిన అంశాలను, వాటి ప్రత్యేకతలను, రైతులకు, పట్టేదార్లకు కలిగే ప్రయోజనాలను వివరించారు. దీని ద్వారా రైతులకు కాలయాపన లేని సేవలు అందుతాయని వెల్లడించారు. ప్రతి భూ కమతానికి భూధార్ వలన రైతులకు మేలు జరగడంతోపాటు రాష్ట్రంలో భూ వివాదాలు తగ్గుతాయని చెప్పారు.
ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి మా ట్లాడుతూ.. రెవెన్యూ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ కోరడం అభినందనీయమని అన్నా రు. ఇతర శాఖలకు బదలాయించిన వీఆర్వో, వీఆర్‌ఏలను మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని మంత్రిని కోరారు. ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తేనే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సకాలంలో అందుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు చంద్రకళ, రమాదేవి, చంద్రయ్య, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీశ్, క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ
ఎలాంటి ప్రత్యామ్నాయ ఆలోచన చేయకుండా దురుద్దేశంతో గత ప్రభు త్వం వీఆర్వో, వీఏవో వ్యవస్థను రద్దు చేసిందని, దీంతో గ్రామ స్థాయిలో రెవె న్యూ భూ పరిపాలన అస్థవ్యస్థంగా మారడంతో పాటు ప్రజలకు రెవెన్యూ సేవలు దూరం అయ్యాయని శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి ఆ శాఖ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, రెవెన్యూ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో తమ ప్రభు త్వం సానుకూలంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే రెవెన్యూ ఉద్యోగ సం ఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులందరూ నిబద్ధతతో, జవాబుదారీతనంతో పనిచేయాలని రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు.






