09-11-2025 12:51:24 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): రాష్ర్ట రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార హోరుకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. గడిచిన పదిహేను రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు, వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరాహోరీగా సాగిన బహిరంగ ప్రచార పర్వానికి నేటితో ఫుల్‌స్టాప్ పడనుంది.
ఎన్నికల కమిషన్ ఈసీ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఇక ఓటరు తీర్పే కీలకం కానుంది. ప్రచార గడువు ముగిసిన వెంటనే పోలింగ్ ముగిసే 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 48 గంటల పాటు ‘సైలెంట్ పీరియడ్’ అమల్లోకి వస్తుంది. ఈ సమయంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదు.
బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, రోడ్‌షోలు పూర్తిగా నిషిద్ధం. లౌడ్ స్పీకర్ల వాడకంపై సంపూర్ణ నిషేధం ఉంటుంది. ముఖ్యంగా, ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఫలితాలను వెల్లడించడం లేదా వాటిపై చర్చలు నిర్వహించడం కూడా పూర్తిగా నిషిద్ధం.
మాటల యుద్ధానికి ముగింపు
ఉపఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం తారస్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి, అభివృద్ధి కావాలంటే అధికార పార్టీకే ఓటేయాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ తరఫున వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ అన్నీ తానై ప్రచార భారాన్ని మోశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ, తమ పదేళ్ల పాలనలోని అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరఫున కేంద్రమం త్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వంటి కీలక నేతలు ప్రచారం చేసి, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ దొందూ దొందేనని, నిజమైన మార్పు బీజేపీతోనే సాధ్యమని వాదించారు. ఈ క్రమంలో నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది.
బయటి నేతలు నియోజకవర్గం వీడాలి
సైలెంట్ పీరియడ్ ప్రారంభం కాగానే, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందని బయటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, పార్టీల కార్యకర్తలు తక్షణమే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చివరి నిమిషంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరింపులకు పాల్పడటం వంటి అక్రమాలను నివారించేందుకే ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని కల్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జీలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఈసీ
ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు. డబ్బు, మద్యం పంపిణీ వంటి కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వులైన్స్ బృందాలు నిరంతరం గస్తీ కాస్తాయని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాం తంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని పార్టీలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.