ఒక దోసిలి మౌనం దొరుకుతుందా?
తెల్లారిన దగ్గర్నుంచి అలుపెరగని
రణగొణ ధ్వనుల మధ్య
చెవులు చిల్లులు పడేలా
అర్థంలేని ఆక్రందనల ప్రవాహం!
******
ప్రతీ చౌరస్తాలోనూ తెగని పంచాయితీలే
ప్రతీ గొంతులో నెగ్గాలనే పంతాలే
ఎవరికి వాళ్ళే గెలవాలనే ఆరాటంలో
నిత్యం చెలరేగే వాదనల హోరుతో
డప్పులా మారిన ప్రపంచంలో
బేతాళుడి అరుపులకు భీతిల్లారా?
******
విసిరేసిన మాటలేవైనా గాజుముక్కలై
గుండెల్ని చీల్చుతున్నాయా?
వేల వేల ఇజాల బరువును భుజాన వేసుకుని
దిక్కుతోచక, కేకలతో
కంటిమీద కునుకు రాక..
చితికిపోయారా..?
******
అయితే రండి.. నేనో మౌనాన్ని అమ్మే దుకాణం తెరిచాను..
దాచిన పిడికెడు స్వప్నాలు ఇవ్వండి చాలు
దోసిళ్ల నిండా గాఢమైన నిశ్శబ్దాన్ని ఇస్తాను
ఎప్పటికీ ఆగని అలల ఘోష వెనుక
దాగిన నిశ్చలతను,
రాత్రివేళ ఆకుల్రాల్చిన మౌనాన్ని
ఏరి ఏరి పోగుచేశాను
ఆకాశాన్ని వంచి నక్షత్రాల మధ్య శూన్యాన్ని జల్లెడపట్టి, చెరిగి,
మేలైన, రాలిన పారిజాతాల,
మౌనగీతాన్ని, మీకోసం
సిద్ధంచేశాను.
******
అంతా ఇచ్చేస్తాను.
ఒక్కసారి ముఖంపై ఆసాంతం
పులుముకుని ఆస్వాదించండి
వెన్నెల రాత్రుల్లో ఎన్ని పాలపుంతలున్నాయో
స్పష్టంగా లెక్కపెట్టొచ్చు
సముద్ర అలలపై జ్ఞాపకాలతో
పరుగు పందెం వేయొచ్చు
పొగమంచులో చలిమంట వెచ్చదనాన్ని
గుండెలో పదిలంగా నింపుకోవచ్చు
ప్రత్యూషాల్లో నీరెండ కాంతులను ఒడిసి పట్టొచ్చు
సంధ్యాసమయంలో అంతరంగ రాగాలను
విలాసంగా ఆలపించొచ్చు
******
కాకపోతే చిన్న షరతు..
ఇప్పటిదాకా సంక దిగనని మొరాయిస్తున్న
అక్కర్లేని ఆశల్నీ - నిరాశల్ని
భారంగామారి బిరుసెక్కిన దిగులు పొరలను
దావానంలా చుట్టేసే దు:ఖాన్ని
దుకాణం గుమ్మం దగ్గరే వదిలేయాలి
******
మూట దించినంతనే దొరికేది సేద మాత్రమే
ఆ శూన్యాన్ని ఆనందంతో నింపే అమృతమీ మౌనం
మరే ఆందోళన తాకనివ్వని అదృశ్య కవచం
కొన్ని స్వప్నాల ఖరీదైనా సరే..
పిసిరంత నిశ్శబ్దాన్ని
ఎదగూటిలో పదిలపరుచుకోవాల్సిందే
అలాగేనంటేనే ఈ ప్రశాంతతను
మీపై కమ్మగా కుమ్మరిస్తాను. ఏమంటారు?




