పట్టుబడుతున్నా మారుతలేరు
- వరుసగా ఏసీబీకి చిక్కుతున్న ఉద్యోగులు, అధికారులు
- పరువుపోతున్నదని రంగారెడ్డి ప్రజల ఆవేదన
రంగారెడ్డి, ఆగస్టు 22 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటూ వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్నా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో మార్పు రావడం లేదు. ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతోపాటు అదనపు కలెక్టర్ స్థాయి అధికారులుండటం గమనార్హం. అధికారుల తీరుతో జిల్లా పరువు పోతున్నదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు, ఉద్యోగాల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ శశాంక స్పందించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ప్రత్యేక దృష్టి సారిం చాలని కోరుతున్నారు.
జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు
జిల్లాలో అదనపు కలెక్టర్ స్థాయి అధికారులు ఏసీబీ దొరకడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భూపాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం గుర్రంగూడలో నిషేధిత జాబితాలో ఉన్న 14 గుంటల భూమిని సరిచేసేందుకు రూ.8 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ నెల 21న గండిపేట్ మండలం మణికొండలో నల్లా కనెక్షన్ ఏర్పాటు కోసం ఇంటి యజమాని నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ జలమండలి మేనేజర్ స్ఫూర్తి, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి పట్టుబడ్డారు.
ఈ నెల 22న వనస్థలిపురంలోని విద్యుత్ శాఖ డీఈ రామ్మోన్‌రావు మంచాల మండలంలో 33/11 కేవీ లైన్ తొలగించి పక్క నుంచి విద్యుత్ లైన్‌ను అమర్చేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.18 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గండిపేట్ మండలంలో ఏఫ్‌టీఎల్ పరిధిలోని బఫర్ జోన్‌లో ఇంటి నిర్మాణాలకు ఎన్‌వోసీ జారీకి రూ.2.50 లక్షలు తీసుకుంటూ జిల్లా నీటి పారుదల శాఖ ఈఈ బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్ కార్తీక్, సెక్షన్ ఏఈ నిఖేష్‌కుమార్, సర్వేయర్ గణేష్ ఏసీబీకి చిక్కారు.
మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు నుంచి పేరును తొలగించేందుకు లంచం తీసుకుంటూ ఎస్సై సైదులు ఏసీబీకి చిక్కాడు. భూముల రికార్డుల మార్పిడి కోసం రూ.4లక్షలు తీసుకుంటూ కేశంపేట్ తహసీల్దార్ లావణ్య, వీఆర్వోలు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇంకా అవినీతి సొమ్ముకు ఆశపడి, లంచం తీసుకుంటూ పట్టుబడిన వారి జాబితాలో చాలామంది అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. వరుసగా ఏసీబీకి చిక్కుతున్నా అధికారులు, ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు.






