07-08-2025 01:25:27 AM
మలయాళ నటి శ్వేత మీనన్‌పై కేసు నమోదైంది. మార్టిన్ అనే ఓ సామాజిక కార్యకర్త నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా కొచ్చి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. డబ్బు కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మార్టిన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఆయన కొన్ని రోజులు క్రితమే ఈ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని సమాచారం.
దీంతో ఆయన ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. శ్వేత మీనన్ ప్రస్తుతం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఆమెపై కేసు నమోదు కావటం చర్చనీయాంశమైంది. ‘అనస్వరం’, ‘రతి నిర్వేదం’, ‘100 డిగ్రీ సెల్సియస్’ వంటి తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో ఆమె నటించింది. తెలుగులో ఆనందం, జూనియర్స్, రాజన్న తదితర సినిమాల్లోనూ శ్వేత మీనన్ కనిపించింది.