9 April, 2026 | 10:29 AM

పోటాపోటీగా పోలింగ్

14-05-2024 01:02 AM

పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు

క్రియాశీలకంగా పనిచేసిన పార్టీల శ్రేణులు

చాలాచోట్ల త్రిముఖం.. కొన్నిచోట్ల ద్విముఖ పోరు

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. 17 లోక్‌సభ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్‌లో ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం ౭ గంటల నుంచే బారులు తీరారు. మధ్యాహ్నం ఎండ కారణంగా కాస్త పలుచగా కనిపించినా, సాయంత్రం మళ్లీ పెద్దపెద్ద క్యూలు కనిపించాయి. సాయంత్రం ౬ గంటలకు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా చాలాచోట్ల ప్రజలు ఓటువేసేందుకు లైన్లలో నిలబడ్డారు. వారికి ఓటు వేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మొదటినుంచీ నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. పోలింగ్ రోజు కూడా ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు అదేవిధంగా శ్రమించారు. అన్నిచోట్లా ఓటర్లు ప్రధాన పార్టీలకే మద్దత్తు పలికినట్టు కనడింది. 

ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోటీ ఉంటుందని, భావించినప్పటికీ.. పోలింగ్ సరళిని చూస్తే చాలాచోట్ల త్రిముఖ పోటీ కనపడింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ లాంటి స్థానాల్లో ద్విముఖ పోటీ ఉండగా, నిజామాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, ఆదిలాబాద్, భువనగిరి స్థానాల్లో త్రిముఖ పోటీ కనిపించింది. భారీ ఎండలను కూడా లెక్కచేయకుండా ప్రధాన పార్టీల నేతలు ప్రచారం చేయడంతో.. పోలింగ్ రోజు దాని ప్రభావం కనపడింది.

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తగ్గి కాస్త చల్లబడి వాతావరణం కూడా సహకరించడంతో ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకే వృద్ధులు, పనులకు వెళ్లేవారు లైన్లు కట్టారు. ఉదయం 11 గంటల వరకు గ్రామాల్లో దాదాపు 25 శాతం పోలింగ్ నమోదైంది. తీవ్ర పోటీ ఉండటంతో ఒక్క ఓటు కూడా ముఖ్యమని గ్రహించిన ప్రధాన పార్టీల నేతలు.. ఓటర్లను స్వయంగా పోలింగ్ కేంద్రాలకు తరలించడం కనపడింది. రాత్రి 9 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఓటింగ్‌శాతం 70కి అటూ ఇటుగా నమోదైంది. అతి తక్కువ పోలింగ్ విషయంలో హైదరాబాద్ తన రికార్డును నిలబెట్టుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో అతి తక్కువ పోలింగ్ నమోదైంది.  

త్రిముఖ పోరు

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఒక్క లోక్‌సభ స్థానం ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా బీజేపీ సీరియస్‌గా తీసుకొన్నది. తెలంగాణలోని ౧౭ స్థానా ల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని పోరాడింది. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా పదేపదే రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. అదే సమయంలో కొత్తగా వచ్చిన అధికారాన్ని పదిలం చేసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠగా తీసుకొన్నది. ఇక బీఆర్‌ఎస్ పార్టీ పోయినచోటే వెతుక్కోవాలనే గట్టి పట్టుదలతో పోరాడింది.

ఎన్ని కల షెడ్యూల్ వచ్చినప్పుడు పోరు ద్విముఖమే అని అందరూ భావించారు. కానీ, తన బస్సుయాత్రతో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల పోరాటాన్ని త్రిముఖంగా మార్చేశారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్ స్థానాల్లో మొదట వెనుకబడ్డ బీఆర్‌ఎస్.. కేసీఆర్ ప్రచారంతో పుంజుకొని పోటీలోకి వచ్చిందని పోలింగ్ సరళి తెలియజేస్తున్నది.  

ద్విముఖం

హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం, బీజేపీ మధ్యనే పోటీ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఇక్కడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ప్రారంభంలోనే చేతులెత్తేశాయి. ఖమ్మంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్టు సమాచారం. అయితే ఇందులో బీజేపీ ఎన్ని ఓట్లు పంచుకుంటుందనేది కూడా గెలుపోటములను ప్రభావితం చేసే అంశమే. పెద్దపల్లిలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇస్తుండగా.. బీజేపీ చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి. కరీంనగర్‌లో బీజేపీతో బీఆర్‌ఎస్ పోటీ పడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లను లాక్కుంటుందనేది తేలాల్సి ఉంది.

వరంగల్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండగా.. బీఆర్‌ఎస్ ఓట్లు ఎటువైపు మళ్లుతాయనేది కీలకంగా మారింది. చేవెళ్లలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. చివరి నిమిషంలో బీసీ కార్డుతో బీఆర్‌ఎస్ పోటీలోకి వచ్చినట్టు కనపడింది. అయితే, ఆ పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపించిందనేది ఫలితాల రోజే తేలుతుంది. నాగర్‌కర్నూల్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పోటీ కనపడినా.. చివరి క్షణంలో కాంగ్రెస్ కూడా పుంజుకొన్నది. మహబూబాబాద్‌లో మొదట కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటీ ఉన్నట్టుగా కనపడినా.. పోలింగు రోజు బీజేపీకి కూడా గణనీయమైన ఓట్లు పడినట్టు తెలుస్తోంది.