యాక్సిడెంట్ తర్వాత రెండేండ్లకు కేసు
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో హైకోర్టులో మహమ్మద్ షకీల్ కుమారుడి ముందస్తు బెయిల్ పిటిషన్
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో 2022లో నమోదైన కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశముందని, ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ కుమారుడు మహమ్మద్ రహీల్ ఆమీర్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో కారు కేబుల్ బ్రిడ్జి నుంచి వస్తూ ఓ కుటుంబాన్ని ఢీకొట్టిందంటూ 2022 మార్చి 17న కేసు నమోదైందని, ఇందులో అసన్ మహమ్మద్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని తెలిపాడు. ఇప్పుడు రాజకీయ కక్షతో సంఘటన జరిగిన రెండేళ్ల తరువాత కేసును తిరిగి విచారణ చేపట్టి తనను ఇరికించారని ఆరోపించాడు. పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశాడు. తనకు ఇక్కడ స్థిరాస్తులున్నాయని, పారిపోయే అవకాశం లేదని, అందువల్ల ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరాడు.






