30 June, 2026 | 11:14 AM

ప్రయాణికులకు ప్రాణ సంకటం!

13-06-2024 01:38 AM
  • చొప్పదండిలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు

ఎన్నికలకు ముందు అట్టహాసంగా ప్రారంభం

అనుభవనం లేని కాంట్రాక్టరుకు అప్పగింత

పూర్తిస్థాయి ప్రణాళిక లేకుండానే పనులు 

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

చొప్పదండి, జూన్ 12: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో రెండేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిధుల లేమితో పాటు రోడ్డు నిర్మాణంలో అనుభవం లేని కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంతో రెండేళ్లుగా మందకొడిగా సాగాయి. అసంపూర్తిగా ఉన్న రోడ్డుపై రోజూ ఏదో ఓచోటా ప్రమాదం జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. చొప్పదండి పట్టణంలోని గుమ్లాపూర్ క్రాస్ రోడ్డు నుంచి స్థానిక డి కాలువ వరకు సుమారు ౩ కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులను 2022 ఫిబ్రవరిలో అప్పటి పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

వంద అడుగుల మేర రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్‌తోపాటు రహదారికి ఇరువైపులా మురుగునీటి కాలువల నిర్మాణానికి సుమారు రూ.33 కోట్లను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎలాంటి అనుభవం లేని గుత్తేదారుకు పనులు అప్పగించడంతో ముందస్తు ప్రణాళిక లేకుండా ఒంటెత్తు పోకడతో పనులు చేపట్టారు. రహదారి మధ్య డివైడర్ పనులతోపాటు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం ఒకేసారి చేపట్టడంతో వాహనాదారులకు ఇబ్బందిగామారింది.

దారికి ఇరువైపు లా ఉన్న కరెంటు స్తంభాలను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాల్సి వుండగా వాటి ని తొలగించకుండానే పనులు చేపట్టడం విస్మయానికి గురిచేస్తున్న ది. విస్తరణలో భాగంగా సగానిపైగా చదును చేయని మట్టి రోడ్డు వేసి వదిలేశారు. డివైడర్‌ను ఆనుకొని ఇరు వైపులా కొం తమేర మాత్రమే పాత బీటీరోడ్డు ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులెదురవుతున్నాయి. 

పాత బీటీ రోడ్డుపై రాకపోకలతో ప్రమాదాలు

కరీంనగర్ నుంచి చొప్పదండి మీదుగా లక్షెట్టిపేట, మంచిర్యాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో రోజూ అనేక భారీ వాహనాలు ఈ దారిగుండానే రాకపోకలు సాగిస్తుంటా యి. అవసరాల నిమిత్తం స్థానిక ప్రజలు కూడా ఈ దారిగుండానే ప్రయాణిస్తుంటారు. అయి తే డివైడర్‌ను ఆనుకొని ఇరువైపులా కొంతమేర మాత్రమే పాత బీటీరోడ్డు ఉండడం, విస్తరణలో భాగంగా సగానికిపైగా చదును చేయని మట్టిరోడ్డు వేసి వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

కొంతమేర మాత్రమే ఉన్న బీటీరోడ్డు పైనుంచి వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ భారీ వాహనం బీటీరోడ్డు పైనుం చి వెళ్తూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడం తో రోడ్డుపైనే పల్టీకొట్టింది. గతంలో పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇలా నిత్యం ఏదో ఓచోట ప్రమాదాలు జరిగి, గాయపడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు, వాహన వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్డు విస్తరణ పను లను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.  

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అరచేతిలో వైకుంఠం..

నియోజకవర్గ కేంద్రమైన చొప్పదండి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధిని సాధించలేదు. గత ప్రభుత్వ హయాంలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణంతోపాటు రోడ్డు విస్తరణ పనులను ఆర్భాటంగా ప్రారంభించడంతో విస్తరిస్తున్న పట్టణానికి అందాన్ని పెంచుతుందని ప్రజలు భావించారు. కానీ, మధ్యలోనే పనులు నిలిచిపోవడంతో వారికి నిరాశే మిగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ, సెంట్రల్ లైటింగ్ పనులను గ్రాఫిక్స్ ద్వారా ప్రదర్శిస్తూ త్వరగా అందుబాటులోకి తెస్తామంటూ హడావిడి చేశారు.

కానీ, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ కలగానే మిగిలిపోనుందని ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు గత ప్రభుత్వం టీఎఫ్‌ఐడీసీ నుంచి రుణరూపంలో మాత్రమే నిధులను అందించగా.. అప్పును పట్టణ మున్సిపల్ శాఖ చెల్లించాలనే నిబంధన ఉన్నదని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు.