చదువుకు పేద, ధనిక భేదం లేదు
మరిపెడ (మహబూబాబాద్) జూన్ 1 (విజయక్రాంతి): విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించి, ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వాల్య తండా గ్రామ సర్పంచ్ నాగ నాయక్ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఈ మేరకు సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల పదవ తరగతిలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ.2,000, ద్వితీయ ర్యాంకు సాధించిన వారికి రూ.1,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. అలాగే ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ప్రథమ స్థానం సాధించిన వారికి రూ.2,000, ద్వితీయ స్థానం సాధించిన వారికి రూ.1,000 చొప్పున నగదు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మరిపెడ ఎస్త్స్ర గండ్రాతి సతీష్ మాట్లాడుతూ చదువుకు పేద ధనిక భేదం లేదని, లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వాల్య తండా గ్రామ సర్పంచ్ నాగ నాయక్ మాట్లాడుతూ, గ్రామంలోని విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిభ కనబరిచే విద్యార్థులకు గ్రామపంచాయతీ తరఫున, వ్యక్తిగతంగా తమవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యాభివృద్ధే గ్రామాభివృద్ధికి మూలమని తెలిపారు.






