ఎరువుల షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
మరిపెడ (మహబూబాబాద్) జూన్ 2 (విజయక్రాంతి): మరిపెడ పట్టణంలో సోమవారం ఎరువుల షాపుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తనాల విక్రయాలకు సంబంధించిన లైసెన్సులు, విత్తనాల కొనుగోలు ఇన్వాయిస్లు, ఎరువుల క్రయ,విక్రయాల రికార్డులు, నిల్వల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా డీలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం ప్రతి డీలర్ బాధ్యత అని అధికారులు స్పష్టం చేశారు. నాసిరకం విత్తనాలు విక్రయించడం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడం లేదా నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ తహసీల్దార్ జి.లక్ష్మణ్, ఇన్స్పెక్టర్ జి.రాకేష్, ఏవో బి. వీరాసింగ్, ఏఈఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.






