న్యాయవాది దంపతుల హత్యపై బోని కొట్టిన సీబీఐ
పెద్దపల్లి జిల్లా మంథని కి చేరుకున్న సిబిఐ అధికారుల బృందం...
వామన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి విచారణ ప్రారంభం
మంథని, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు(High Court Advocate Gattu Vaman Rao ) - నాగమణి దంపతుల హత్య ఘటనపై సిబిఐ రంగంలోకి దిగింది. మంథని డివిజన్ రామగిరి మండలంలో 2021 ఫిబ్రవరి 17న మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై రామగిరి మండలం కలవచర్ల గ్రామ పంచాయతీ మారుతి నగర్ వద్ద వాహన మడ్డగించి కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన విధితమే. వామన్ రావు దంపతుల హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే.
ఈ ఘటనలో ప్రధాన నిందితులను అరెస్టు చేసి విచారణ లో జాప్యం జరుగుతున్న ఇటీవల వామన్ రావు తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ కేసును సిబిఐ కి బదలాయింపు చేస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసును సిబిఐ కి అప్పగించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉత్కంఠ రేపుతున్న క్రమంలో గురువారం నాడు సిబిఐ అధికారుల బృందం ముందుగా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో వామన్ రావు ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి అనంతరం హత్య జరిగిన ప్రాంతం కు చేరుకొని విచారణ ప్రారంభించింది. వారి వెంట గోదావరిఖని ఏసీపీ రమేష్ పాల్గొన్నారు. సిబిఐ విచారణ ప్రారంభం కావడంతో మంథని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.




