27-10-2025 06:38:28 PM
హైదరాబాద్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని దేవాదాయ & అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించారు. రైతులు దళారీల చేతిలో నష్టపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని మద్దతు ధరకు నేరుగా కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. పత్తి పంటకు క్వింటాల్‌కు రూ.8,110 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. కావున రైతులు దళారీల చేతిలో మోసపోకుండా నేరుగా సీసీఐ కేంద్రాలకు తమ పత్తిని విక్రయించాలని సూచించారు. తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ... గత పదేళ్లలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ వరి వేస్తే ఉరే అంటే ప్రజా ప్రభుత్వం మాత్రం వరికి బోనస్ ఇస్తుందన్నారు. ప్రత్యేకంగా రైతుల సమస్యలను గుర్తించి మఖ్యమంత్రి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నేరుగా రైతుల వద్దే కొనుగోలు చేస్తుందని మంత్రి సురేఖ కొనియాడారు. అదే తరహాలో నాణ్యమైన పత్తి తీసుకొని వచ్చి మంచి ధరను పొందాలని కోరారు. కిసాన్ యాప్ ద్వారా బుక్ చేసుకుని యాప్ నిర్ధారించిన సమయం తేదీకి పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని పోవాలని, సీసీఐకి పత్తి అమ్మితే వారం రోజుల లోపు రైతు ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. 23 మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నారని, 12 శాతం లోపు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేస్తారని, పట్టా పాస్ బుక్ తీసుకొని వస్తేనే కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. ఎఈవో ద్వారా జరిగే ఈ పత్తి కొనుగోలు ఆన్ లైన్ ద్వారా మాత్రమే జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవిందర్ రెడ్డి, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.