09-09-2025 01:27:43 AM
-కేంద్ర ప్రభుత్వమే తెరిపించాలి..
-ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం..
-తిరిగి ప్లాంట్ అందుబాటులోకి వస్తే 3 వేల మందికి ఉపాధి
-సీసీఐ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఖాయిలా పడిన ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్‌ను పునరుద్ధరించా లని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం సీసీఐ రీజినల్ మేనేజర్ ఉమేశ్ కుమార్ సింగ్, తాండూరు సీసీఐ ప్లాంట్ జీఎం శరద్‌కుమార్‌ను కోరారు. హైదరాబాద్‌లోని సచివాలయం లో సోమవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీసీఐ సీఎండీ సంజయ్‌బంగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి సీసీఐ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
ప్లాంట్ పునరుద్ధరణ ప్రతిపాదనలపై మంత్రి వారితో చర్చించారు. ప్లాంట్‌ను ఆధునిక యంత్రాలతో పునరుద్ధరించేందు కు రూ.2 వేల కోట్లు అవసరమని సీసీఐ సీఎండీ సం జయ్ బంగా తెలిపారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ మే చొరవ తీసుకుని ప్లాంట్‌ను పునరుద్ధరించాలని, ప్లాంట్ అందుబాటులోకి వస్తే సుమారు 3 వేల మంది కి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్లాంట్ తిరిగి నడిపించాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తానూ పలు సందర్భాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు.
ప్లాంట్ ప్రైవేటీకరణను (డిస్‌ఇన్వెస్టిమెంట్) తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని కుండబద్దలు కొట్టారు. ప్లాంట్ పునరుద్ధరణకు సీసీఐ రాష్ట్రప్ర భుత్వం నుంచి ప్రతిపాదనలు కోరుతున్నదని, త్వరలో నే దీనిపై తమ అభిప్రాయాన్ని తెలుపుతామని వెల్లడించారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలా చారి సీసీఐ ప్లాంట్ పునరుద్ధరణపై సూచనలు, సలహాలిచ్చారు. సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, గనులశాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, టీజీఐఐసీ ఎండీ శశాంక పాల్గొన్నారు.