09-09-2025 01:32:55 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): కుమ్రం భీం జిల్లా కౌటాల మండ లం పరిధిలోని ప్రాణహిత నదిపై తుమ్మడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. అలాగే ప్రాణహిత -చేవెళ్ల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని, ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని జల సౌధలో సోమవారం రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, నిర్మాణ పనులు, పురోగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చి న హామీ మేరకు ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన చేవెళ్ల --ప్రాణహితకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల్లో సమ్మక్క- సాగర్ ముఖ్యమైనదని పేర్కొ న్నారు.
ప్రాజెక్ట్‌కు సంబంధించి ఈ నెల 23 న ఢిల్లీలో జరుగనున్న కేంద్ర జలవనరుల సంఘం సమావేశంలో నీటి కేటాయింపులతో పాటు టెక్నికల్ అడ్వుజరీ కమిటీ నుంచి ప్రాజెక్ట్‌లకు అనుమతి తీసుకోవాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి వచ్చే అనుమ తులపైనా దృష్టి సారించాలని సూచించారు. సీతారాంసాగర్, మోడికుంట వాగు, చనాకా/కొరాట డిస్ట్రిబ్యూటరీ సిస్టంతో పాటు చిన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
కృష్ణా జలాలకు సం బంధించి ట్రిబ్యునల్ విషయమై సుప్రీంకోర్టులో ఈ నెల 23, -25న వాదనలు ఉన్నం దున, అంతకు ముందే సుప్రీంకోర్టు న్యాయవాది సీఎస్ వైద్యనాధ్‌తో చర్చలు జరపా లన్నారు. జాతీయ డ్యాంల పరిరక్షణ సంస్థ సూచనలకు అనుగుణంగా మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బరాజ్‌లను పునరుద్ధరించాలని సూచించారు. ఐఐటీ నిపుణులతో అధ్య యనాలను ముమ్మరం చేయించాలని ఆదేశించారు.
వచ్చే సంవత్సరం వానాకాలం లోపు పనులన్నింటినీ పూర్తి చేయాల్సి ఉం టుందన్నారు. పాలమూరు-- రంగారెడ్డి ఎత్తిపోతల పథం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాస ప్రక్రియను సత్వరం పూర్తి చేస్తామని వివరించారు. కొడంగల్ - -నారాయణపేట ప్రాజె క్టుకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నందున ప్రత్యామ్నాయ బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి ముందే దేవాదుల ప్యాకేజ్- 3, 6 పను ల పురోగతిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మిడ్ మానేరు, కడెం రిజర్వా యర్ల లో పూడికతీత పనులు చేపట్టామన్నారు. త్వరలో జూరాల, నాగార్జున సాగర్, ఎస్సార్ ఎస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోనూ పూడికతీత పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
పూడికతీత పనుల ద్వారా ప్రభుత్వానికి రూ.500 కోట్ల రాబడి ఉంటుందని వివరించారు. పనులను రాష్ట్రమంతటికీ విస్తరిస్తే ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అంచనా వేశారు. ఎస్‌ఎల్బీసీ పనుల పునరుద్ధరణకు హెలిబోర్న్ సర్వే చేపడతామని, అందుకు ఇప్పటికే రెండు హెలికాప్టర్లను సిద్ధం చేశామని వెల్లడించారు. నీటిపారుదలశాఖలో సుదీర్ఘ విరామం తర్వాత పదోన్న తుల ప్రక్రియ పూర్తి చేశామన్నారు.
పదోన్నతులు పొందినవారి కోసం ఈ నెల 14న జలసౌధలో అభినందన సభ నిర్వహిస్తామన్నారు. అనంతరం సొరంగం సమీపం లో హెలిబోర్న్ ఏరియల్ మాగ్నెటిక్ సర్వే ఏ ర్పాట్లను మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్షలో నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎ న్సీ అంజద్ హుస్సేన్, సీఈలు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.