15 July, 2026 | 8:04 PM

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల ఆకస్మిక దాడి.. ఆరుగురి అరెస్ట్

15-07-2026 08:00 PM

భూపాలపల్లి,(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాలతో జిల్లా సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలోని సీసీఎస్ పోలీసులు బుధవారం సాయంత్రం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం గ్రామం ఆజంనగర్ అటవీ ప్రాంతం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 6 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి రూ.7,450 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

దాడి జరుగుతున్న సమయంలో మరో 7 మంది నిందితులు పరారయ్యారు. అరెస్టు చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా పోలీసులు ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు కొనసాగిస్తారని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.