15 July, 2026 | 7:53 PM

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు

15-07-2026 07:52 PM

తాత్కాలిక వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: కలెక్టర్ కె. హైమావతి

హుస్నాబాద్: హుస్నాబాద్ శాతవాహన ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాత్కాలిక వసతి గృహాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి స్పష్టం చేశారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు విద్యార్థుల వసతి, భోజనం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల, టిటీసీ భవనం, ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వసతి ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో కౌన్సెలింగ్ ద్వారా కొత్తగా చేరే విద్యార్థులతో పాటు రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల భవనంలోని ముందు భాగంలో ఉన్న రెండు గదులను ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినుల వసతి కోసం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

బాలుర వసతి కోసం టిటీసీ భవనాన్ని ఇప్పటికే కేటాయించామని, ఈ విద్యా సంవత్సరంలో చేరే విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనపు పడకలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థినులతో పాటు ప్రీ-మెట్రిక్ విద్యార్థినులతో కూడా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు.

శాశ్వత ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యే వరకు శాతవాహన ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంతో సమన్వయం చేసుకుని విద్యార్థులకు వసతి, భోజనం, పరిశుభ్రత, మరుగుదొడ్లు తదితర అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, శాతవాహన ఇంజినీరింగ్ కళాశాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.