15 July, 2026 | 7:58 PM

కుల, మతాలకు అతీతంగా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

15-07-2026 07:57 PM

గణపురం,(విజయక్రాంతి): కుల, మతాలకు అతీతంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను గ్రామస్థాయిలో కొనసాగించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య పేర్కొన్నారు. గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ అధ్యక్షతన బుధవారం సంఘ సమావేశం నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్ల మల్లయ్య మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి అంబేద్కర్ యువజన సంఘాన్ని బలోపేతం చేసి అంబేద్కర్ ఆశయాలను ప్రతి గ్రామంలో విస్తరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు, వివక్ష పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఐక్యంగా సంఘటితమై రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని అన్నారు.

భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, రిజర్వేషన్లు, ఓటు హక్కుతో పాటు అనేక అవకాశాలను కల్పించిందని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అనంతరం, అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ జేబీ రాజు, రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ అవిలయ్య సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సభ్యత్వ రుసుము రూ.100గా నిర్ణయించినట్లు తెలిపారు.