14 May, 2026 | 4:53 AM

సింగరేణిపై కేంద్రం కుట్రలు

21-06-2024 12:53 AM
  • బొగ్గు గనుల వేలానికి ఒక్కటైన కాంగ్రెస్, బీజేపీ
  • వేలం పాట మానుకోకుంటే ఉద్యమిస్తాం: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): సింగరేణి సంస్థను ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. తెలంగాణకు బీఆర్‌ఎస్ పార్టీ ఒక రక్షణ కవచం, శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. 25 సంవత్సరాల నుంచి తెలంగాణ దోపిడీకి గురికాకుండా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాపాడారని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, సుంకెం రవితో కలిసి ఆయన మాట్లాడారు. 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తేవాల్సింది పోయి ఉన్నవాటినే అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినందుకు ఆ పార్టీ ఇచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొగ్గు గనుల వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ధైర్యం చేయలేదని.. ఇప్పడు కాంగ్రెస్, బీజేపీలు కలిసి హైదరాబాద్ వేదికగా వేలంతో తెలంగాణ సంపదను దోచిపెట్టేందుకు సిద్ధమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని కేసీఆర్ అంటే, 16 ఎంపీలు సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారని.. ఏపీలో టీడీపీ 16 ఎంపీలు గెలవడంతో విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా ఆపగలిగిందని గుర్తుచేశారు. బొగ్గు గనుల వేలం పెట్టవద్దని పీసీసీ నేతగా గతంలో రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని, సీఎం అయిన తర్వాత ఎందుకు రాజీ పడుతున్నారని నిలదీశారు. దీని వెనక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కేసులకు భయపడుతున్నట్లు కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తంచేశారు. 

ఎక్కడా లేని విధానాలు ఇక్కడెందుకు?

ఒడిశాలో రెండు గనులను వేలం లేకుండా నైవేలీ లిగ్నెట్‌కు అప్పగించారని, అలాగే గుజరాత్‌లో కూడా వేలం లేకుండా ప్రభుత్వ రంగం సంస్థలకు అప్పగించారని కేటీఆర్ గుర్తుచేశారు. తమిళనాడులో రాష్ట్ర బీజేపీ నేతలు వేలం వేయవద్దని కోరడంతో ప్రభుత్వ సంస్థకు బొగ్గు గనుల వేలం లేకుండా ఇచ్చారని, సింగరేణికి మాత్రం గనుల కావాలంటే వేలంలో పాల్గొనాలంటున్నారని మండిపడ్డారు. ‘అదానీకి బైలాడిల్లా గని కేటాయించ డంతో విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లింది. అదే అదనుగా ఆ సంస్థను అమ్ముతున్నామని కేం ద్రం చెప్పింది. ఇప్పుడు బొగ్గు గనులు కేటాయించకపోతే సింగరేణి నష్టాల్లోకి వెళ్తుంది. లక్షల మంది ఉపాధి కోల్పోతారు. ఆ విధంగా సింగరేణిని ఖతం చేసే కుట్రను బీజేపీ, కాంగ్రె స్ అమలు చేస్తున్నాయి’ అని కేటీఆర్ ఆరోపించారు. ఈ కుట్రను బీఆర్‌ఎస్ అడ్డుకుంటుం దని, దీనిపై భవిష్యత్తు కార్యాచరణ రెండుమూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. 

సింగరేణిని కాపాడేది బీఆర్‌ఎస్సే

కేంద్రం మా మెడపై కత్తిపెట్టినా బొగ్గు గనుల వేలం వేయకుండా చూశామని కేటీఆర్ తెలిపారు. తొమ్మిదిన్నరేళ్లు సింగరేణిని కాపాడుకున్నామని చెప్పారు. సింగరేణి కార్మికులు జంగ్ సైరస్ ఊదితే దక్షిణ బారతదేశం అంధకారంలోకి వెళ్లిందని, ఎప్పటికైనా సింగరేణిని కాపాడేది బీఆర్‌ఎస్ మాత్రమే అన్న సంగతి మరిచిపోవద్దని సూచించారు. మన గనుల్లో మనం బొగ్గు తవ్వుకోకుండా అడ్డుకోవడం దుర్మార్గమని, దీనిని కార్మికులు అర్థం చేసుకోవాలని కోరారు. సింగరేణి బొగ్గు బ్లాకులను కార్పొరేట్ దోపిడీదారులకు కట్టబెట్టడాన్ని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ చేతగానితనంతో మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు. నేడు బీఆర్‌ఎస్ లోక్‌సభలో లేకపోవడంతో సింగరేణి గనులు వేలం వేస్తున్నారని అన్నారు. బీజేపీ నిర్ణయానికి కాంగ్రెస్ ఎందుకు వంతపాడుతున్నదని ప్రశ్నించారు. శుక్రవారం జరిగే వేలం పాటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు పాల్గొంటున్నారని నిలదీశారు. వేలం పాటను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పడు వేలంను రద్దు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని వేలంలో పాల్గొనే సంస్థలు గమనించాలని హెచ్చరించారు.