14 May, 2026 | 3:53 AM

బొగ్గు గనులపై బొంకులేల!

21-06-2024 12:56 AM
  • రాష్ట్రంలో బొగ్గు బ్లాకుల స్కాం 
  • పథకం ప్రకారం సింగరేణికి ద్రోహం 
  • డిప్యూటీ సీఎం భట్టి ఆరోపణ

* గోదావరి బేసిన్‌లోని కోల్ బ్లాకులు కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను అప్పనంగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు.  మైన్స్ అండ్ మినరల్ యాక్ట్ (1957)ను సవరించి  బొగ్గుగనులకు వేలం పాట పెట్టేందుకు 2017లో  కేంద్ర చట్టం చేశారు. ఆ బిల్లుకు  బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. సింగరేణికి బొగ్గు బ్లాక్‌లు కేటాయించే అవకాశం లేకుండా యాక్ట్‌కు మద్దతిచ్చి తగుదునమ్మా అంటూ ఇప్పుడు కాంగ్రెస్‌పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. కేవలం వారి మిత్రులకు మేలు చేసేందుకే వ్యవస్థలను సర్వనాశనం చేసే చర్యలకు పాల్పడుతున్నారు. బొగ్గు గనుల కుంభకోణంలో బీఆర్‌ఎస్, బీజేపీలు తోడు దొంగలు. 

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


ఖమ్మం, జూన్ 20 (విజయక్రాంతి): కోల్ బ్లాక్‌ల వేలంలో సింగ రేణి సంస్థ 2021 అక్టోబర్ 29న పాల్గొనేందుకు సుముఖత చూపినా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు వద్దని వారించి పెద్ద కుట్రకు తెరలేపారని.. 2021 నవంబర్ 5న కుట్రకు బీజం పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మరోవైపు ఒడిశాలోని బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థను పంపారని చెప్పా రు. బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు సమాచా రంతో  కార్మిక లోకాన్ని  పక్కదారి పట్టించవద్దని ఆయన సూచించారు. ఖమ్మంలో గురువారం మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

వేలం పాటలను రద్దు చేయాలి

గోదావరి బేసిన్‌లోని కోల్ బ్లాకులకు వేలం పాటలు పెట్టకుండా ఆపాలని కోరతామని, ఇక్కడి కోల్ బ్లాక్‌లను సింగరేణి సంస్థకే కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనులు 7.5కు ఇప్పటికే కైవసమయ్యాయని, అయితే మరో 0.5 జోడించి సింగరేణి సంస్థ వేలంలో పాల్గొంటుందని భట్టి తెలిపారు. సింగరేణి సంస్థతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయా లని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తాను వ్యక్తి గతంగా కలిసి అన్ని విషయాలను కిషన్ రెడ్డి ముందుంచు తానని తెలిపారు. ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ విషయమై విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు.

బాండ్ల రూపంలో అవినీతి 

 గత ప్రభుత్వంలోని కీలక నేతలకు సన్నిహిత కంపెనీలుగా మెలిగిన అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ భాగస్వామ్య ఆరో కోల్ కంపెనీ, శ్రీఅవంతికా కాంట్రాక్టర్స్, ప్రతిమా గ్రూప్‌లకు కోల్ బ్లాక్‌లు అప్పగించేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అరబిందో గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి  పై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ మేరకు బీజేపీ,  బీఆర్‌ఎస్‌కు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో లబ్ధిచేకూరిందని ఆయన ఆరోపించారు.

సింగరేణి చరిత్రగా మిగులుతుంది

42 వేల మంది కార్మికులు, 40 బొగ్గు గనుల ద్వారా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుపుతున్న సింగరేణిలో, 2032 నాటికి బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోనుందని భట్టి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బొగ్గు గనులను సంపాదించడం అనివార్యం అన్నారు. లేదంటే సింగరేణి సంస్థ కేవలం ఒక  చరిత్రగా  నిలిచే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల అఖిలపక్షాన్ని కూడా తెస్తామన్నారు. ఖమ్మం జిల్లాలోని కోయగూడెం 3, సత్తుపల్లి - 3 కోల్ బ్లాక్‌లను పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

చరిత్ర క్షమించదు: తుమ్మల

గతంలో ఒడిశా రాష్ట్రంలోని బొగ్గు గనిని వేలం లేకుండా సింగరేణికి ఇచ్చారని, ఇప్పుడు అదే విధంగా ఇవ్వాలని అడుగుతున్నామని  రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సింగరేణి  సంస్థ దివాళా తీసే విధంగా జరుగుతున్న కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని  అన్నారు. సింగరేణి సంస్థ, కోల్ ఇండియా కంటే మెరుగైన పనితీరు గలదని చెప్పారు. తెలంగాణలోని బొగ్గు గనులు సింగరేణికే కేటాయించాలని అడుగుతున్నాం. ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించింది సింగరేణి అన్నారు. సింగరేణితో నిర్వహణ సాధ్యం కాని గనులను వేలం వేసుకోవాలన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కూనంనేని, రాగమయి,  రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.