calender_icon.png 25 July, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుపుల మంధాన

30-10-2024 12:00:00 AM

శతకంతో చెలరేగిన జూనియర్ కోహ్లీ

  1. మూడో వన్డేలో కివీస్‌పై భారత్ విజయం 
  2. టీమిండియాదే వన్డే సిరీస్

అహ్మదాబాద్: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడా తో ఘన విజయాన్ని అందుకుంది.

233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 44.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పో యి టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన (122 బంతుల్లో 100; 10 ఫోర్లు) మాస్ శతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (59 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో రాణించింది.

న్యూజిలాండ్ బౌలర్లలో హన్నా రోవే 2 వికెట్లు పడగొట్టింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్ హాలిడే (86) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జార్జియా ప్లిమ్మర్ (39) పర్వాలేదనిపించింది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. ప్రియా మిశ్రా రెండు, రేణుకా, సైమాలు చెరొక వికెట్  తీశారు. శతకంతో అలరించిన మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు లభించాయి. 

సెంచరీతో ఫామ్‌లోకి ..

స్వదేశంలో సిరీస్ సొంతమవ్వాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. తొలుత బౌలింగ్‌లో దీప్తి శర్మ, ప్రియా మిశ్రా రాణించడంతో కివీస్ నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. అయితే వరుసగా రెండు వన్డేల్లోనూ తీవ్రంగా నిరాశప రిచిన మంధాన ఈ మ్యాచ్‌లో మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో తన శైలికి భిన్నంగా నిధానంగా ఆడిన మంధాన క్రీజులో పాతుకు పోయిన అనంతరం పరుగులు రాబట్టింది. కెరీర్‌లో 8వ వన్డే సెంచరీ సాధిం చిన మంధాన జట్టు విజయానికి దగ్గరవుతున్న సమయంలో ఔటయ్యింది. అయితే అప్పటికే ధాటిగా ఆడుతున్న కెప్టెన్ హర్మన్.. జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి మిగతా పనిని పూర్తి చేసింది. 

దీప్తి కెరీర్ బెస్ట్.. 

కివీస్‌తో వన్డే సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన భారత ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. బౌలింగ్ విభాగంలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ర్యాంక్‌లో నిలిచింది. దీప్తి రెండో ర్యాంకుకు చేరుకోవడం ఇదే తొలిసారి. ఆల్‌రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మంధాన ఒక స్థానం దిగజారి నాలుగో ర్యాంకులో నిలిచింది.