లేటరల్ ఎంట్రీపై కేంద్రం యూటర్న్
నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని యూపీఎస్సీకి ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 20: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అత్యున్నత పోస్టుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రైవేటు వ్యక్తులను నియమించటంపై తీవ్ర విమర్శలు రావటంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. లేటరల్ ఎంట్రీ ద్వారా 45 పోస్టులను భర్తీచేసేందుకు యూపీఎస్సీ జారీచేసిన నోటిఫికేషన్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని మంగళవారం ఆదేశించింది. దీంతో యూపీఎస్సీ ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ‘ఏది ఏమైనా రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మేం కాపాడే తీరుతాం. నేను మళ్లీ చెప్తున్న.. 50 శాతానికి రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధనను తొలగిస్తాం. కుల జనాభా ఆధారంగా సామాజిక న్యాయం కల్పిస్తాం. జై హింద్’ అని రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పోస్టును పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే ట్యాగ్ చేస్తూ.. మరో పోస్ట్ చేశారు.






