10 August, 2026 | 7:46 PM

కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి

10-08-2026 06:45 PM

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సీఐటీయు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం దేవేందర్ మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకు, రైతులకు ప్రజా వ్యతిరేక విధానాలను అతివేగంగా అమలు చేస్తున్నదని అన్నారు.

ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 8 గంటలనుండి 12 గంటల పని దినాన్ని సమ్మె హక్కులు కాలరాయడం, ఉద్యోగ భద్రత, హైర్  అండ్ ఫైర్ విధానం కనీస వేతనాలు సామాజిక భద్రత, వృత్తి సంబంధిత రక్షణ ఈ కోడులతో భవన నిర్మాణం, హమాలీలు, ట్రాన్స్పోర్ట్ తదితర  అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం గాలికి వదిలేశారని అన్నారు. ఈ లేబర్ కోడ్లు అమలు అయితే తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు కార్మిక వర్గం కోల్పోతామని అన్నారు.

పోలం రాజేందర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉత్పత్తి ధరలను తగ్గించి నిర్ణయించడం వలన గిట్టుబాటు ధర రావడం లేదని, కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని అన్నారు. రుణ విమోచన చట్టం చేయాలని కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేయడం లేదని రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు పంట రుణాల సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం చెల్లించాలని, భీమా సౌకర్యం కల్పించాలని అన్నారు.