కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
రంగారెడ్డి, మే 28 (విజయక్రాంతి): జూన్ 4న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ కోసం పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని సీఈఓ వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షసమావేశం నిర్వహించా రు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంకతో పాటు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డిసీపీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా చేపట్టాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. మలివిడత ర్యాండమైజేషన్ జరిపి దాని ప్రకారం సిబ్బందిని కేటాయించాలన్నారు.
కౌటింగ్ రోజు ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా అధికారులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ముఖ్యంగా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఓట్ల లెక్కింపు పక్రియలో భాగంగా అవసరమైతే రీకౌంటింగ్ నిర్వహణ గురించి సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. లెక్కింపు సమయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా సీసీ కెమెరాల నిఘా మధ్యలో కౌంటింగ్ చేపట్టాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు చేపట్టాలని నిబంధనలకు లోబడి సంబరాలు చేసుకొనేందుకు అనుమతించాలన్నారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ శశాంక వివిధ శాఖలతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల కౌంటింగ్, ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి ఆరా తీసి పలు సూచనలు చేశారు.






