మమ్ముట్టి, గౌతమ్ మీనన్ కలయికలో..
ప్రముఖ మలయాళ కథానాయకుడు మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్ 15ను ఆరంభం కానుండగా, మమ్ముట్టి 20 నుండి షూట్‌లో పాల్గొననున్నారు. కాగా మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థలో నిర్మితంకానున్న ఈ సినిమాలో సమంత నటిస్తున్నట్టు తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా గతంలో ఒక యాడ్ ఫిల్మ్ కోసం కలిసి నటించిన మమ్ముట్టి, సమంత ఇప్పుడు సినిమా కోసం తెర పంచుకోనున్నారు. తొలి సినిమా ‘ఏ మాయ చేశావే’లో మలయాళీ అమ్మాయిగా కనపడిన సమంత, తన తొలి చిత్ర దర్శకుడైన గౌతమ్ మీనన్ ద్వారానే ఇప్పుడు మలయాళ సినిమాలో అడుగు పెట్టనుండటం విశేషం. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఏప్రిల్‌లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ప్రకటించి, దానికోసం నిర్మాతగానూ మారారు. ఈ సినిమాలతో ఆమె మలి ప్రయాణం మొదలైనట్టే అని అభిమానులు భావిస్తున్నారు.






