23 August, 2026 | 3:43 AM

పాత పెన్షన్ కోసం ‘నేడు ఛలో హైదరాబాద్’

23-08-2026 01:26 AM

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి):సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల భారీ బహిరంగ సభ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిగా ఉద్యోగులు తరలిరానున్నందున ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. 80 నియోజకవర్గాల్లో జనజాగరణ యాత్రను చేపట్టి, 73 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు మంత్రులను కలిసి నేరుగా తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు.

ఈ యాత్రను ఈనెల 18న విజయవంతంగా ముగించుకుని ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోనూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.

పాత పెన్షన్ విధానంలో కచ్చితమైన సామాజిక భద్రత ఉండగా, సీపీఎస్ విధానంలో ఉద్యోగి జీతం నుండి నెలకు 10 శాతం కోత విధించడమే కాకుండా, రిటైర్మెంట్ తరువాత ఎలాంటి గ్యారెంటీ లేని నామమాత్రపు పెన్షన్ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈహెచ్‌ఎస్ కేవలం 60 సంవత్సరాల వరకు, అంటే సర్వీసులో ఉన్నంత వరకు మాత్రమే అమలు చేయబడుతోందని తెలిపారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు.