1 September, 2026 | 8:41 AM

రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు నివాళి

08-06-2024 03:39 PM

హైదరాబాద్ : రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. రామోజీరావు మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన మరణం తీరని లోటని, తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. అక్షర యోధుడిగా తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించిన ఆయన తెలుగు వారి జీవితాల్లో ప్రభవవంతమైన ముద్రవేశారని చెప్పారు. 

రామోజీరావు మరణం తెలుగు ప్రజలకే కాదు.. దేశానికి కూడా తీరని లోటన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేలది మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకం అన్నారు. ఆయనతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని, మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరుకు తనను దగ్గర చేసిందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థింస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.