నీట్ ఎగ్జామ్ లో అక్రమాలు : కేటీఆర్
హైదరాబాద్ : నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం స్పందించారు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ పరీక్షలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం 67 మంది విద్యార్థులు 720/720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్, చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్ పరీక్షలో (+4, -1) మార్కింగ్ విధానం ఉంటుందని, ఈ లెక్కన 718, 719 మార్కులు రావటం అసాధ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి విడుదల చేయడం అనుమానాలను రేకెత్తిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణలో గత 5 ఏళ్లలో ఏ విద్యార్థి కూడా నీట్ లో టాప్ 5 ర్యాకింగ్ రాలేని ఆయన సూచించారు.కచ్చితంగా నీట్ ఎగ్జామ్ లో అక్రమాలు జరిగినట్లు తము నమ్ముతున్నామన్నారు. గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం ఏ విధానామైన ప్రక్రియను అనుసరించారో బహిర్గంత చేయాలని డిమాండ్ చేశారు. కొంత మంది విద్యార్థుల గ్రూప్‌కు మాత్రమే మేలు చేసే విధంగా గ్రేస్ మార్కులు కలిపారని, అది సరైన విధానం కాదని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై హై లైవల్ ఎక్స్ పర్ట్ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోన్నట్లు తెలిపారు. నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి అన్యాయం జరిగిన విద్యార్థులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.






