calender_icon.png 21 August, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ సిలబస్‌లో మార్పు

05-12-2024 03:02:02 AM

  1. ఆర్ట్స్ కోర్సుల్లో 30 శాతం, సైన్స్ కోర్సుల్లో 20 శాతం!
  2. పోటీ పరీక్షల్లో రాణించేలా రూపకల్పన
  3. ఇంజినీరింగ్‌లో  50 శాతం థియరీ క్లాసులు, 50 శాతం ఇటర్న్‌షిప్
  4. ఉన్నత విద్యామండలి కసరత్తు 

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్ కోర్సుల సిలబస్‌ను సమగ్రంగా మార్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. కొద్దిరోజులుగా దీనిపై ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం ఆర్ట్స్ కోర్సుల్లో 30 శాతం, సైన్స్ కోర్సుల్లో 20 శాతం సిలబస్ మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇలా ప్రతి ఏటా 20 నుంచి 30 శాతం చొప్పున డిగ్రీ సిలబస్‌ను మార్చనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సివిల్స్, గ్రూప్ 2, 3, 4 పోటీ పరీక్షల్లో అనుసరిస్తున్న సిలబస్‌ను డిగ్రీ ఆర్ట్స్ కోర్సుల్లో పెట్టనున్నారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా లేని సిలబస్‌ను తీసివేయనున్నారు. మారిన సిలబస్‌కు అనుగుణంగా ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వనున్నారు. సైన్స్ కోర్సుల వర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) కమిటీల్లో పారిశ్రామికవేత్తలు, సీసీఎంబీ, ఐఐసీటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల శాస్త్రవేత్తలకు చోటు కల్పించి, అవసరం మేరకు సిలబస్‌లో మార్పులు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. 

ఇంజినీరింగ్‌లో  50 శాతం ఇంటర్న్‌షిప్..

ఇంజినీరింగ్ విద్యావిధానంలోనూ 50 శాతం ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 50 శాతం థియరీ క్లాసులు, 50 శాతం ఇంటర్న్‌షిప్ అమలు చేస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తున్నారు. ఇక డిగ్రీ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వర్క్స్‌తోపాటు ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించడం తప్పనిసరి చేయనున్నారు. వచ్చే విద్యాసం వత్సరం ఈ సిలబస్‌ను అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెలలో యూనివర్సిటీల వీసీలు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాలు నిర్వహించి సిలబస్‌ను ఆమోదింపజేసి అమలు చేసేందుకు మండలి ఏర్పాట్లు చేస్తున్నది. 

ప్రతీ ఏటా జాబ్ మేళాలు..

కొన్ని చోట్ల మినహాయిస్తే దాదాపు మెజార్టీ కాలేజీల్లో ప్రాంగణ నియామకాలు జరగడంలేదు. ప్రతి ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో విధిగా జాబ్‌మేళాలను నిర్వహించేలా మార్పులు చేయనున్నారు. విద్యార్థి చదువు పూర్తి చేసుకొని జాబ్‌తో బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. జాబ్‌మేళాను నిర్వహించడం ద్వారా విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపించేలా సిలబస్, కోర్సుల్లో మార్పులు చేయనున్నారు.

సిలబస్‌లో మార్పులు ఇవే..

* ఫిషరీస్, హార్టికల్చర్ వంటి అగ్రికల్చర్ అనుబంధ కోర్సులను ఎంచుకునే విద్యార్థులు విధిగా గ్రామాల్లోకి వెళ్లి రైతులను కలవాలి. నాగలి, ఎడ్లు, ఎరువులు వంటి     వివరాలను సేకరించాలి. ఎకరానికి ఎంత పంట పండుతుందనే విషయంపై ప్రాజెక్టు రిపోర్ట్ రాయాలి.

* బీకాం కోర్సుల్లోని విద్యార్థులకు బ్యాంకుల ఓచర్లు రాయడం రావడంలేదు. డీడీ అంటే ఏమిటి? విత్‌డ్రా, డిపాజిట్ ఫామ్‌కు తేడా తెల్వడంలేదు. ఈ నేపథ్యంలో     బీకాంలో బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ కార్యకలాపాలపైనా పాఠ్యాంశాలుంటాయి. 

* డిగ్రీ తెలుగు పుస్తకాల్లో స్థానిక కవుల పాఠాలు, పద్యాలు చేర్చుతారు. అలాగే మన విద్యార్థులు ఆంథ్రోపాలజీతో సివిల్స్‌లో రాణిస్తున్నారు. ఇదే తరహాలో తెలుగు     ఆప్షన్‌తోనూ సివిల్స్ రాసే వారి సంఖ్యను పెంచేలా సిలబస్‌లో మార్పు లు చేపట్టారు. సివిల్స్ మోడల్‌లో తెలుగు సిలబస్‌ను మార్చుతారు.

* ఇటీవల కాలంలో సైబర్ మోసాల కారణంగా బ్యాంకు ఖాతాలు గుల్లవుతు న్నా యి. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా సిలబస్‌లో మార్పులు చేస్తారు.

* డిజిటల్ పాఠాల బోధనకు టీథూ ఐఐటీ మద్రాస్‌తో ఎంవోయూను కుదుర్చుకుంటారు. ఆయా పాఠాలను కాలేజీల్లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు.

* కాలేజీల్లో చేరే విద్యార్థులు ఏ నాలెడ్జ్‌తో వస్తున్నారో... బయటికి వెళ్లేటప్పుడు కూడా అంతే నాలెడ్జ్‌తో వెళ్తున్నారు. వా రి చేతుల్లో డిగ్రీ సర్టిఫికెట్ మినహాయిస్తే     విజ్ఞానం మాత్రం పెంచుకోవడం లేదు.