05-12-2024 03:54:17 AM
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించాలంటే రిజర్వేషన్ లేని ప్రయాణికులకు నరకం కనిపిస్తుంటుంది. ఒక్కో రైలుకు ముందు ఒకటి, వెనకలా మరోటి మాత్రమే జనరల్ బోగీలుంటాయి. ఒక్కో బోగిలో మహా అంటే 72 నుంచి 90 వరకు సీట్లుంటాయి. కానీ, ఒక్కో బోగీలో కనీసం 300 నుంచి 400 మంది వరకు ప్రయాణిస్తారు. కనీసం గాలి కూడా ఆడనంతగా కిక్కిరిసి ఉంటాయీ బోగీలు.
చాలామంది ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తూ ప్రాణాలను రిస్కులో పెడతారు. సాధారణంగా ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో 18 నుంచి 26 వరకు బోగీలుంటాయి. కానీ, వీటిలో జనరల్ ప్యాసింజర్ కోసం కేవలం రెండంటే రెండే బోగీలుంటాయి. చాలా మంది రిజర్వేషన్ టికెట్ల ధరలను భరించలేకపోవడం వల్ల, మరికొందరు రిజర్వేషన్లు లభించకపోవడం వల్ల, అత్యవసర ప్రయాణాల వల్ల జనరల్ బోగీలను ఆశ్రయిస్తారు.
సాధారణ ప్రయాణికులను పట్టించుకోని రైల్వే శాఖ జనరల్ బోగీలు కేవలం రెండింటిని మాత్రమే అందుబాటులో ఉంచుతూ వస్తోంది. ఫలితంగా ప్రయాణికులు ఇన్నాళ్లుగా ఎన్నో కష్టాలు పడుతూ ప్రయాణాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల కష్టాలను గుర్తించిన రైల్వే శాఖ జనరల్ బోగీలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో నూతన అధునాతన ఎల్‌హెచ్‌బి (లింక్ హాఫ్‌మన్ బుష్) కోచ్‌ల తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో రైళ్లకు అదనపు జనరల్ బోగీలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. కొత్తగా తీసుకువస్తున్న జనరల్ బోగీలు ప్రయాణికుల పాలిట వరంగా మారబోతాయని చెప్పవచ్చు.
ద.మ.రైల్వే పరిధిలో 66 అదనపు ఎల్‌హెచ్‌బి కోచ్‌లు
ద.మ.రైల్వే పరిధిలోని 19 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు (33 రేక్‌లు) 66 నూతన ఎల్‌హెచ్‌బి కోచ్‌లను జత చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రస్తుతం ఉన్న రెండు జనరల్ కోచ్‌లకు అదనంగా మరో రెండు కోచ్‌లను పెంచుతారు. దీంతో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు చేరుతుంది. దీంతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా మారనుంది. ఫలితంగా ప్రతి రైలులో సుమారు మరో 180 వరకు సీట్లు పెరుగుతాయి.
నిలబడి ప్రయాణించే వారిని కూడా కలుపుకుంటే ఇకపై ఒక్కో రైలు జనరల్ బోగీలలో కనీసం 600 నుంచి 800 మంది వరకు ప్రయాణించేందుకు వీలవుతుంది. త్వరలో ద.మ.రైల్వే పరిధిలోని మరో 21 రైళ్లకు (40 రేక్‌లు) 80 అదనపు ఎల్‌హెచ్‌బి కోచ్‌లను ప్రవేశపెట్టనున్నారు. దీంతో 40 రైళ్లకు గాను 146 నూతన కోచ్‌లను తీసుకువచ్చినట్లుగా అవుతుంది. 370 రైళ్లకు 1000 కోచ్‌లను తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.
ఫలితంగా నిత్యం సుమారు 1 లక్ష మంది అదనంగా ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుందని ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. రైల్వే శాఖ మంచి నిర్ణయం తీసుకుందని వినియోగదారుల సంఘం అధ్యక్షుడు నూర్ విజయక్రాంతికి తెలిపారు.
అదనపు ఎల్‌హెచ్‌బి కోచ్‌లను జత చేస్తున్న పలు ముఖ్యమైన రైళ్లు
క్ర.సం. ఎక్కడి నుంచి ఎక్కడికి రైలు నెం.
1 సికింద్రాబాద్ గుంటూరు సికింద్రాబాద 12706/12705
2 హైదరాబాద్ నిజాముద్దీన్ 12721/12722
3 సికింద్రాబాద్ కాగజ్‌నగర్ టౌన 12757/12758
4 సికింద్రాబాద్ దానాపూర్ సికింద్రాబాద్ 12791/12792
5 సికింద్రాబాద్ హౌరా సికింద్రాబాద్ 12704/12703
6 సికింద్రాబాద్ గూడూరు సికింద్రాబాద్ 12715/12716
7 కాకినాడ లింగంపల్లి కాకినాడ 12737/12738
8 లింగంపల్లి2 ముంబయి సీఎసీె్ట లింగంపల్లి 17058/17057
9 కాకినాడ సాయినగర్ షిర్డీ 17026/17205
10 తిరుపతి లింగంపల్లి తిరుపతి 12733/12734
11 కాచిగూడ మంగుళూరు కాచిగూడ 12789/12790
12 కాచిగూడ మధురై కాచిగూడ 12715/12716
13 తిరుపతి సికింద్రాబాద్ తిరుపతి 12797/12798