11 April, 2026 | 2:21 PM

పోలీస్ బాస్‌ల పరిధి మార్పు

29-12-2025 01:53 AM

పోలీస్ శాఖలో మెగా రీ షఫ్లింగ్

జీహెచ్‌ఎంసీ తరహాలోనే 12 జోన్ల వ్యవస్థ

సిటీ చేతికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధి కుదింపు

తెరపైకి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్

యాదాద్రిని రాచకొండ నుంచి వేరు చేసే యోచన!

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పాలనా స్వరూపం మారిన దరిమిలా.. నగర శాంతిభద్రతల ముఖచిత్రం కూడా స మూలంగా మారబోతోంది. బల్దియాను 12 జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే పోలీ స్ శాఖలోనూ చారిత్రాత్మక మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్ల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సరిహద్దులను చెరిపేసి, కొత్తగా 12 జోన్ల పోలీస్ వ్యవస్థను తీసుకురానున్నారు. ఈ భారీ ప్రక్షాళన లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి విస్తరించి అత్యంత శక్తివంతంగా మారనుండగా, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.

హైదరాబాద్ మెగా కమిషనరేట్ 

కొత్త ప్రతిపాదనల ప్రకారం మొత్తం 12 జోన్లలో సగం అంటే 6 జోన్లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకే రానున్నాయి. ఇప్పటివరకు సైబరా బాద్ పరిధిలో ఉన్న కీలకమైన ప్రాంతాలు సిటీలో కలవనున్నాయి. చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ల తో పాటు కొత్తగా రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు హైదరాబాద్ సీపీ పరిధిలోకి వస్తాయి. ఈ మార్పులో అత్యంత కీలకమైన అంశం ఇన్నాళ్లు సైబరాబాద్ పరిధిలో ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా పర్యవేక్షణ ఇకపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్వా ల్ చేతికి రానుంది. వీవీఐపీల రాకపోకలు, భద్రతా పరమైన అంశాల్లో సమన్వ యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సైబరాబాద్‌లో భారీ మార్పులు 

ఐటీ కారిడార్‌కు కేంద్రమైన సైబరాబాద్ కమిషనరేట్ స్వరూపం మారనుంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్. శేరిలిం గంపల్లి జోన్ పరిధిని మొయినాబాద్ నుం చి పటాన్‌చెరు వరకు విస్తరించనున్నారు. అలాగే, ఐటీ హబ్ అయిన మాదాపూర్‌ను కూకట్‌పల్లి జోన్‌పరిధిలోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇది పరిపాలనాపరంగా అతిపెద్ద మార్పు కానుంది.

రాచకొండ పరిధి కుదింపు

3 జోన్లు విస్తీర్ణంలో అతిపెద్ద కమిషనరేట్‌గా ఉన్న రాచకొండ పరిధిని కుదించి, అర్బన్ ప్రాంతాలపైనే దృష్టి సారించేలా ప్రణాళిక రచించారు. జోన్లు.. ఎల్బీ నగర్, మల్కాజిగిరి, ఉప్పల్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా ను కమిషనరేట్ నుంచి విడదీసి, తిరిగి పోలీస్ జిల్లాగా మార్చనున్నారు. దీంతో రాచకొండ సీపీ ఇకపై కేవలం నగర శివారు ప్రాంతాలపైనే ఫోకస్ పెట్టనున్నారు.

నయా జోనల్ వ్యవస్థ ఇలా..

-ప్రతిపాదిత 12 పోలీస్ జోన్ల విభజన స్వరూపం

-కమిషనరేట్ జోన్లు పరిధిలోకి వచ్చే కీలక ప్రాంతాలు

-హైదరాబాద్‌ 6.. చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ పాతబస్తీ, కోర్ సిటీ, ఎయిర్‌పోర్ట్, వ్యవసాయ వర్సిటీ ప్రాంతాలు.

-సైబరాబాద్ 3 శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పారిశ్రామిక వాడలు.

-రాచకొండ ఎల్బీ నగర్, మల్కాజిగిరి, ఉప్పల్, తూర్పు హైదరాబాద్, విజయవాడ హైవే, వరంగల్ హైవే కనెక్టివిటీ

కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్..

రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫోర్త్ సిటీ కి భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ వినూత్న ప్రతిపాదనను సిద్ధం చేసింది. మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల ప్రాంతాలను కలుపుతూ.. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పా టు చేసే యోచనలో ఉంది. ఇది కార్యరూ పం దాల్చితే నగర చుట్టూ నాలుగో కమిషనరేట్ అందుబాటులోకి వస్తుంది. లేదా ఈ ప్రాంతాలను ప్రత్యేక జోన్‌గా చేసి సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశముంది. బల్దియాలో జోనల్ కమిషనర్లు, సర్కిల్ డీసీలు ఎలాగైతే ఉంటారో.. పోలీస్ శాఖలోనూ డీసీపీలు, ఏసీపీలు అదే పరిధిలో ఉండేలా చూడటమే ఈ రీ-షఫ్లింగ్ ప్రధాన ఉద్దేశం. సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీ స్ అడ్మినిస్ట్రేషన్ సరిహద్దులు ఒకేలా ఉంటే.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు, విపత్తుల నిర్వహణలోనూ సమన్వయం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.