16 August, 2026 | 11:18 AM

మైనింగ్ టెక్నాలజీ బదిలీ చేస్తాం

24-05-2024 02:13 AM

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): రానున్న ఐదేండ్లలో సింగరేణి నిర్దేశించుకున్న 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన ఆధునిక మైనింగ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతికత విషయాల్లో సహకారం అందిస్తామని ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ డెనిస్ ఈటెన్ అన్నారు. ఈ విషయంపై సింగరేణి భవన్‌లో కమిషనర్ డెనిస్ ఈటెన్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సంస్థలో ఉపయోగిస్తున్న సాంకేతికత, ఈ ఏడాది సాధించిన రికార్డు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్, సంస్థ వృద్ధి రేటును వివరించారు. బొగ్గు ఉత్పత్తితోపాటు వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా థర్మల్, సోలార్ విద్యుత్తు రంగాల్లోకి విజయవంతంగా అడుగుపెట్టినట్టు వివరించారు.

అలాగే ఇతర రంగాల్లోనూ ప్రవేశించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన సింటార్స్ తదితర సంస్థలతో మైనింగ్, రక్షణ, సాంకేతిక విషయాల్లో సేవలు స్వీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ గుర్తు చేశారు. సింగరేణిలో వినియో గిస్తున్న సాంకేతికత, సంస్థ చేపడుతున్న నూతన వ్యాపార విస్తరణ చర్యలను స్వయం గా చూసేందుకు నవంబరులో ఆస్ట్రేలియా బృందం సింగరేణి ప్రాంతంలో పర్యటించనుందని డెనిస్ ఈటెన్ తెలిపారు. అలాగే మైనింగ్ రంగంలో నూతన సాంకేతికతలపై తమ దేశంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సంస్థ ప్రగతికి దోహదపడే అంశాలపై సహకారాన్ని అవసరమైనప్పుడు స్వీకరిస్తామని బలరామ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ రామకృష్ణ పాల్గొన్నారు. 

-ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్