భారత్ బ్రాండ్ ఎక్కడ?
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదలుకాని అమ్మకాలు
ఎదురుచూపుల్లో పేద ప్రజలు
మెదక్, మే 23(విజయక్రాంతి): నిరు పేదలకు, మధ్య తరగతి కుటుంబాలకు భారత్ బ్రాండ్ నిత్యావసర సరుకులు వరంగా మారాయి. కానీ వాటిని అందుకోవడానికి ఉమ్మడి మెదక్ జిల్లావాసులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు నిత్యా వసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ తరుణంలో తక్కువ ధరలకే కొన్ని సరకులు అందజేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. అయితే అవి నేటికీ అందుబాటులోకి రావ డం లేదు. కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో నిత్యావసర సరకులైన ఉల్లిగడ్డ, బియ్యం, గోధుమపిండి, శనగపప్పు, పెసరపప్పును తక్కువ ధరకే ప్రజలకు అందిస్తామ ని చెప్పినా నేటికీ అవి మార్కెట్లోకి రాలేదు.
ఉల్లిగడ్డ మార్కెట్‌లో అధిక ధర ఉన్నప్పుడు తక్కువ ధరకే అందజేసింది. మిగతావి మార్కెట్లోకి వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రం అందుబాటులోకి రాలేదు. రాష్ట్రం లో కేవలం మూడు చోట్ల మాత్రమే భారత్ బ్రాండ్ సరకులు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాపేడ్), జాతీయ సహకార వినియోగదారుల ఫెడరేషన్ (ఎన్సీసీఎఫ్) ద్వారా విక్రయదారులను నియమించి సరకులను మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. కాగా రాష్ట్రంలో కేవలం హైదరాబాద్, కరీంనగర్, కామారెడ్డి ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో కూడా బియ్యం, గోధుమపిండి, శనగపప్పు పూర్తి స్థాయిలో సరఫరా కాలేదని తెలుస్తోంది.
నిరుపేదలకు అందుబాటు ధరలో..
బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. భారత్ బ్రాండ్ బియ్యం అయితే పది కిలోల బస్తా రూ.290, పది కిలోల గోధుమపిండి రూ.275, శనగపప్పు కిలో రూ.60, పెసరపప్పు కిలో రూ.104కు అందజేస్తారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక కుటుంబానికి నెలకు ఒకసారి పంపిణీ చేస్తారు. ఇవి బహిరంగ మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువ. వీటిని కొనుగోలు చేస్తే పేదలకు ఎంతో కొంత ఆర్థికంగా కలిసివస్తుంది. త్వరలోనే అన్ని జిల్లాల్లో వీటి విక్రయాలు జరుగుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.






