27 June, 2026 | 3:37 AM

పద్ధతి మార్చుకోండి.. లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు

27-06-2026 02:00 AM

రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్

భద్రాచలం, జూన్  26,  (విజయక్రాంతి): పద్ధతి మార్చుకోండి, లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని రౌడీషీటర్లకు భద్రచలం డిఎస్పి అరుణ్ కుమార్ హెచ్చరించారు. భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు.  రౌడీషీటర్ల ప్రవర్తన, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న జీవన విధానంపై డీఎస్పీ ఆరా తీశారు. అలాగే, వారు ఏయే కేసుల్లో నిందితులుగా ఉన్నారో వివరాలు తెలుసుకుని, భవిష్యత్లో వారి ప్రవర్తన ఎలా ఉండాలనే అంశంపై సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పట్టణంలో ఎలాంటి అలజడి సృష్టించకుండా శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించే వారిని రౌడీషీటర్ల జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లేనిపక్షంలో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగరాజు, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.