27 June, 2026 | 3:35 AM

ఆక్రమణల జోలికెల్లరేం?

27-06-2026 01:58 AM

రోడ్డు విస్తరణలో పేదల ఆస్తులు కూల్చిన అధికారులు

రోడ్లను ఆక్రమించినా వాటి జోలికి వెళ్ళని ఆఫసర్లు..

నిరుపేదలపై కక్ష సాధింపు ఎందుకు..?

కేసముద్రం, జూన్ 26 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణ రోడ్ల విస్తరణలో భాగంగా అనేకమంది షాపులు, గృహాలను, నిరుపేదల ఉపాధి అవకాశాలను కోల్పోయేలా నిర్మాణాలను తొలగించిన అధికా రులు, రోడ్లను దర్జాగా ఆక్రమించుకొని ని ర్మించిన ఆక్రమణల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

రోడ్ల విస్తరణ పేరుతో నిరుపేదలను ఉన్నఫలంగా ఖాళీ చేయించిన అధికారులు, అదే తీరు ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై వ్యవహరించడం లేదని, పేదలకు ఓ తీరు.. ఉన్నోళ్లకు మరో తీరుగా తమ వ్యవహార శైలిని చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసముద్రం పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇరువైపులా పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రహదారులు భవనాల శాఖ 15 ఏళ్ల క్రితం భూమి సేకరించి నిర్వాసితులకు నష్టపరిహారం కూడా చెల్లించింది.

100 అడుగుల రోడ్డు నిర్మించడానికి అవసరమైన స్థలాన్ని సేకరించి ఆర్ అండ్ బి శాఖ స్వాధీనం చేసుకుంది. సేకరించిన రోడ్డు భూమికి ఇరువైపులా ఆర్ అండ్ బి శాఖ సిమెంట్ దిమ్మెలతో ప్రత్యేకంగా హద్దురాళ్ళను ఏర్పా టు చేసింది. అనంతరం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ఇరువైపులా ప్రత్యేకంగా హైమాస్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ లైన్లను కూడా ప్రత్యేకంగా 100 అడుగుల రోడ్డు మార్కింగ్ ఇచ్చి ఏర్పాటు చేశారు.

తర్వాత కొందరు 100 అడుగుల వెనక్కి నిర్మించుకున్న ఇండ్లను, షాపులను కొంతమేర ముందుకు జరిపి ఆర్ అండ్ బి శాఖ రెండు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఈ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించడానికి చర్యలు తీసుకున్నారు. అయితే కొన్నిచోట్ల ఆక్రమణకు గురైన రోడ్డు స్థలాన్ని గుర్తించిన అధికారులు కొంతమేర తొలగించినట్లు చేసి, పూర్తిగా తొలగించకుండా వదిలేసినట్లు విమర్శలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి, మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ వరకు 100 అడుగుల రోడ్డు అనేక చోట్ల ఆక్రమణలకు గురైందని, కొందరు డబ్బులు పరిహారంగా ప్రభుత్వం నుండి పొందినప్పటికీ తమ నిర్మాణాలను ఇప్పటివరకు తొలగించలేదని, అటువంటివారిని చూసి చూడనట్లు వదిలేసి, వృత్తి కుటుంబాలపై అధికార జులుం చూపించి ఉన్నఫలంగా తొలగించడం ఏ మేరకు న్యాయమని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్రమించిన వారికి అండగా నిలుస్తూ.. రోడ్డును ఆధారంగా చేసుకుని కుటుంబాలను పోషిస్తున్న పేదలపై కర్కశంగా వ్యవహరించడం ఏ మేరకు న్యాయం అంటూ ప్రశ్ని స్తున్నారు. ప్రభుత్వం నుండి పరిహారం పొం ది, ఆ పరిహారం కూడా తమకు సరిపోలేదని మళ్లీ ప్రభుత్వం నుండి మరికొంత పరిహారం పొంది, స్థలాన్ని మాత్రం ఇంకా తమ స్వాధీనంలోనే ఉంచుకోవడం, అటువంటి వారిపట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం, తమలాంటి పేదలను అక్కడనుండి వెళ్ళగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఒక న్యాయం.. ఉన్నవారికి ఒక న్యా యంగా అధికార వర్గాలు వ్యవ హరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 



ఆక్రమణలను 

పూర్తిగా తొలగిస్తాం..

 కేసముద్రం పట్టణంలో పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ వరకు 100 అడుగుల రోడ్డు కోసం ఆర్ అండ్ బి శాఖ గతంలో స్థలం సేకరించింది. ఇందుకోసం భూ నిర్వాసితులకు డబ్బులు కూడా చెల్లింపు జరిగింది. కొందరు రోడ్డు ను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినట్లు మా దృష్టికి వచ్చింది. త్వరలో ఆక్రమణలను పూర్తిగా పూర్తిగా తొలగిస్తాం. రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు మధ్యలో నుండి 46 అడుగుల దూరం తర్వాత మిగిలిన నాలుగు అడుగుల స్థలంలో డ్రైనేజీ నిర్మిస్తాం. భవిష్యత్తులో కూడా రోడ్లపై ఎటువంటి ఆక్రమణలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.

 శ్రీకాంత్, డీఈఈ, 

ఆర్‌అండ్‌బీ శాఖ