పోలీసుల పేర తనిఖీ
ఆభరణాలు అపహరణ
జగిత్యాల, (విజయక్రాంతి): చేతి సంచిలో గంజాయి తీసుకెళ్తున్నట్లు సమాచారం వచ్చిందని పోలీసుల పేరుతో తనిఖీ చేసి ఓ వృద్ధుని మెడలో బంగారు గొలుసు, చేతి ఉంగరు ఆభరణాలు అపహరించుకెళ్ళిన సంఘటన కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఇందిరా రోడ్డులో మిట్టపల్లి భూమరాజం అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు. తాము పోలీసులం చేతిలో బ్యాగును తనిఖీ చేయాలని చెప్పారు. ఎందుకని వృద్ధుడు ప్రశ్నించడంతో పోలీసుల గుర్తింపు కార్డులు చూపించి మీరు గంజాయి సరఫరా చేస్తున్నట్లు మాకు సమాచారం వచ్చిందని వారు నమ్మబలికారు.
పోలీసులే కదా అని వారికి ఆయన పూర్తి స్థాయిలో సహకరించాడు. దీంతో ఆ వృద్దునికి మాయ మాటలు చెప్పి మెడలో ఉన్న బంగారు చైన్, చేతి ఉంగరం తీసుకొని ఉడాయించారు. కోలుకోవడానికి15 నిమిషాలు పట్టింది. మెడలో ఉన్న తులం బంగారు చైన్, చేతికి పెట్టుకున్న నాలుగు గ్రాముల బంగారు ఉంగరం పోలీసులమని చెప్పి తనిఖీ చేసిన వారిరువురూ బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోయారు. సదరు వ్యక్తి మోస పోయానని తెలుసుకుని ఇంటికెళ్లి కొడుకుతో జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడు చెప్పింది విశ్వశించని పోలీసులు సీసీ పుటేజ్ ను పరిశీలించారు.
కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీస్ నిందితుల కోసం వెతికే పనిలో పడ్డారు. పోలీసుల పేరుతో తనిఖీలు చేస్తూ బంగారు ఆభరణాలు అపహరించు కెళ్ళడంతో నిజం గా పోలీసులు తనిఖీలు చేసినా నమ్మని పరిస్థితి నెలకొందని చర్చించుకుంటుండగా అసలు పోలీస్ లెవరో..నకిలీ పోలీస్ ఎవరో ఎలా గుర్తించేదని జనం బాహాటంగా మాట్లాదుకోవడం గమనార్హం.కాగా పోలీసుల పేర తనిఖీతో జనాల దోచుకుంటూ పోలీసులకే సవాల్ విసిరిన దొంగలను పట్టుకొని ప్రజలకు రక్షకులు రక్షణగా నిలిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.






