వాణిజ్య సముదాయాల్లో.. కాలేజీలకు చెక్!
- ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ల్యాండ్ విధానం అమలు
కొత్తగా కాలేజీలు పెట్టాలంటే సొంత స్థలం ఉండాల్సిందే..
ప్రభుత్వానికి సిఫారసు చేసిన విద్యాకమిషన్
రెండు నుంచి ఐదు ఎకరాలుంటేనే అనుమతులు ఇచ్చేలా సిఫారసు
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల విద్యా వ్యాపారానికి చెక్ పెట్టేలా వి ద్యాకమిషన్ పలు సిఫారసులున్నాయి. అ పార్ట్‌మెంట్‌లో, వాణిజ్య సముదాయా(మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాలు)ల్లో ప్రైవేట్ జూని యర్ కాలేజీలను నిర్వహిస్తూ రకరకాల పేర్ల తో లక్షల ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలకు విద్యాకమిషన్ సిఫారసులు అమలైతే గ నుక ఇక కొత్తగా రాబోయే ఆ తరహా కాలేజీలకు చెక్ పడినట్లేననే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.
ఇరుకు గదుల్లో.. అపార్ట్‌మెంటుల్లో కాకుండా విశాలమైన వాతావర ణంలో కాలేజీలు ఉండాలని తెలిపింది. కొత్త గా జూనియర్ కాలేజీ పెట్టాలన్నా, ఉన్న వా టిని కొనసాగించాలన్నా కమిషన్ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని నివేదికలో స్పష్టం చేసింది. కాలేజీ విస్తీర్ణం ఎంత ఉండాలో కూడా కమిషన్ తన నివేదికలో స్పష్టం చేయ డం గమనార్హం.
జైళ్ల తరహాలో కాలేజీలు
రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నే రేళ్ల శారదా గతంలో కామెంట్ చేస్తూ...అవి కాలేజీలా లేక జైళ్లా అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు కాలేజీల నిర్వహణ అదేవిధంగా ఉందనే ఆరోపణలు కొన్నేండ్లుగా ఉన్నాయి. కనీసం గాలి వెలుతురు రాకుండా, ఒకే తరగతి గది లో సంఖ్యకు మించి విద్యార్థులు, పైగా అందులోనే హాస్టళ్ల నిర్వహణ, చిన్న చిన్న గదుల్లో నలుగురు కంటే ఎక్కువ మంది వి ద్యార్థులు ఉంటున్న పరిస్థితి. కనీసం ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉండని పరిస్థితి.
దాదాపు 12 నుంచి 16 గంటలు చదువు పేరుతో రుద్దుతుంటారు. ఆదివారాలు, సెల వు దినాల్లోనూ తరగతులు నిర్వహిస్తూ వి ద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీల ఆగడాలను చెక్ పెట్టేలా విద్యాకమిషన్ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కనీసం గ్రౌండ్ లేకుండా వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్న కాలేజీలకు చెక్ పడినట్లేనని విద్యార్థుల సంఘాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కనీసం రెండు ఎకరాల్లో ఉండాలి
రాష్ట్రంలో ఇక జూనియర్ కాలేజీకు అనుమతులివ్వాలంటే ల్యాండ్ విధానం అమలు చేయలని ప్రభుత్వానికి సూచించింది. అర్బన్ (పట్టణ) ప్రాంతాల్లో కాలేజీ పెట్టాలంటే కనీసం రెండు ఎకరాలు ఉండాలని, అదే రూరల్ (గ్రామీణ) ప్రాంతాల్లో అనుమతులివ్వాలంటే నాలుగు నుంచి ఐదు ఎకరాల సొంత స్థలం ఉండాలని సిఫారసు చేసింది. అలా ఉంటేనే ప్రభుత్వం అనుమతులివ్వాలని స్పష్టం చేసింది. ఆటస్థలం, గ్రీనరీ, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలని తెలిపింది. ఇలా ఉంటేనే విద్యార్థులకు మేలు జ రుగుతుందనే విధంగా సిఫారసు చేసింది.
ఇది ఆచరణ సాధ్యమయ్యేనా?
ఈ విషయంలో విద్యా కమిషన్ చేసిన సిఫారసులు స్వాగతించేలా ఉన్నప్పటికినీ ఇవి వాస్తవ పరిస్థితికి వచ్చే సరికి ఆచరణకు సాధ్యమవుతాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రైవేట్ కాలేజీను పెట్టాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందులోనూ కాలేజీల నిర్వహణ, సిబ్బంది వేతనాలు, పన్నులు ఇతరత్రా ఖర్చులు అనేకం ఉంటాయి. అందులోనూ కమిషన్ చేసిన సిఫారసులు అసలు అమలయ్యే అవకాశం ఉందా?
అనే అనుమానాలు కలుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో రెండు ఎకరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు ఎకరాల సొంత స్థలం ఉంటేనే కాలేజీలకు అనుమతులివ్వాలంటే ఇది సాధ్యమయ్యే పనా? అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో రెండు ఎకరాల స్థలంలో కాలేజీలు పెట్టే పరిస్థితి ఉంటుందా? అంత స్థలం దొరుకుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో అంటే స్థలాలు అందుబాటులో ఉంటాయి. అవి కూడా ఊరు చివరనే. అక్కడ కూడా అన్నేసి ఎకరాలు సొంత భూమి కల్గి ఉన్నవారు, అందులోనూ కాలేజీ పెట్టాలనుకునే వారు తక్కువే ఉంటారు. ఒకవేళ కాలేజీ పెట్టాలనుకున్న డబ్బులన్నీ సొంత స్థలం కొనుగోలు చేయడానికే ఖర్చు చేస్తే ఇక కాలేజీ ఎలా నడిపిస్తారు. కార్పొరేట్ కాలేజీలకైతే అంతేసి ఎకరాల్లో కాలేజీలను పెట్టే అవకాశముంటుంది కానీ, మిగతా వారికి మాత్రం ఇది కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




