పాకిస్థాన్ X అమెరికా
డల్లాస్: గత టీ20 ప్రపంచకప్ రన్నరప్ పాకిస్థాన్ జట్టు మెగాటోర్నీలో తన వేటను ప్రారంభించనుంది. గ్రూప్ భాగంగా పాకిస్థాన్ గురువారం డల్లాస్ వేదికగా ఆతిథ్య అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమితో పాటు ఐర్లాండ్ చేతిలో పరాజయం పాకిస్థాన్‌ను ఇబ్బంది పెట్టే అంశం. అయితే అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ నేటి మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ బాబర్‌తో పాటు మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, సయీమ్ అయూబ్, ఆజం ఖాన్, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌లతో పటిష్టంగా కనిపిస్తుంది. అయితే పాక్‌కు బౌలింగ్ పెద్ద బలం అని చెప్పొచ్చు. షాహిన్ అఫ్రిది పెద్దన్న పాత్ర పోషించనుండగా.. హారిస్ రవూఫ్, మహ్మద్ ఆమిర్, నసీమ్ షాలు కీలకం కానున్నారు. ఇక ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ అమెరికాతో పోరుకు దూరమయ్యాడు. మరోవైపు తొలి మ్యాచ్‌లో కెనడాకు షాక్ ఇచ్చిన అమెరికా.. పాకిస్థాన్‌పై కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. కెనడాతో మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఆరోన్ జోన్స్ మరోసారి కీలకం కానుండగా.. కోరె అండర్సన్‌పై అందరి దృష్టి నిలవనుంది..






