2 April, 2026 | 3:18 AM

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత బిడ్డలదే..

02-04-2026 12:00 AM

చండూరు ఆర్డీవో శ్రీదేవి

చండూరు, ఏప్రిల్ 1 : వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనా- పాలన చూడడం బిడ్డల బాధ్యత అని  చండూరు ఆర్డీవో శ్రీదేవి అన్నారు. బుధవారం చండూరు మున్సిపాలిటీ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు స్థాపించిన గాంధీజీ పౌండేషన్  నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా  28 వ నెల సందర్భంగా ఆమె సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. 

ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ  చేయడం అభినందనీయమన్నారు. సమాజంలో చాలామందికి డబ్బులు ఉంటాయని, దానం చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుందని, ఏదో ఒక నెల కాకుండా 28 నెలల నుండి ప్రతి నెల ఒకటవ తేదీన 30 మందికి నిత్యవసర సరుకులు పంచడం గొప్ప విషయం  అన్నారు. పనిచేయడానికి శక్తి లేకుండా కుమారులు, కూతుళ్లు లేని ఒంటరి మహిళలే ఎక్కువగా ఉన్నారని, వృద్ధ తల్లిదండ్రుల ఆలనా పాలన చూడడం బిడ్డల బాధ్యత అని గుర్తు చేశారు. 

చిన్నతనంలో తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా చూశారో,  మన తల్లిదండ్రులు వృద్ధులు అయ్యాక మనం అదేవిధంగా చూడాలని తెలిపారు.  గాంధీజీ ఫౌండేషన్  చైర్మన్  డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ,మా ఫౌండేషన్ 28 నెలలుగా  9 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద  విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను,

చనిపోయిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని చేస్తూ వస్తుందని తెలిపారు. త్వరలోనే వాటర్ ట్యాంక్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్,  ఇంచార్జ్ ప్రిన్సిపాల్  పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య,  బుషిపాక యాదగిరి, బోడ విజయ్, బోడ సాయి, గోపి తదితరులు పాల్గొన్నారు.