22-08-2025 09:26:49 AM
హైదరాబాద్: సినీ కార్మిక సంఘాల వివాదంపై(Tollywood Workers Strike) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఎక్స్ వేదికగా స్పందించారు. ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా, ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమ(Telugu Cinema) అభివృద్ధికి ముఖ్యమంత్రి తీసుకొంటున్న చర్యలు అభినందనీయం అన్నారు. హైదరాబాద్ ను దేశానికే కాదు, ప్రపంచ చలనచిత్ర రంగానికే ఓ హబ్ గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినదన్నారు.
తెలుగు చిత్రసీమ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలని, ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.తెలంగాణ ప్రభుత్వ జోక్యంతో సినీ కార్మిక సంఘాల వివాదం కొలిక్కి వచ్చింది. దీంతో సినిమా షూటింగ్‌లు పునఃప్రారంభం కానున్నాయి. సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్డీసీ చైర్మన్ దిల్‌రాజు ధన్యవాదాలు తెలిపారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు. హైదరాబాద్ ను సినిమా హబ్ గా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని దిల్ రాజు పేర్కొన్నారు.